23 రోజుల జైలు జీవితం అనంతరం బెయిల్పై(Bail) విడుదలైన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ(YSRCP) నేత సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై(Coalition Government) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన కుమారుడి రిమాండ్ కాలాన్ని కలుపుకుంటే దాదాపు నెల రోజుల పాటు తాను, తన కుటుంబం కష్టకాలాన్ని ఎదుర్కొన్నామని తెలిపారు.
ఒక సాధారణ ప్రమాదాన్ని హత్యాయత్నం కేసుగా మార్చి తనను జైలుకు(Jail) పంపించారని అప్పలరాజు ఆరోపించారు. అయితే ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు వివిధ వర్గాల ప్రజలు గొంతెత్తడం తనకు గర్వంగా అనిపించిందన్నారు. తన కుమారుడిని (Son) కూడా రాజకీయ కక్షలో భాగంగా కేసులోకి లాగారని ఆరోపించారు.
తన అరెస్టు సమయంలో అండగా నిలిచిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి(YS Jagan Mohan Reddy) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, తటస్థ వర్గాలు తనకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అణచివేత ధోరణిని అవలంబిస్తోందని విమర్శించిన అప్పలరాజు.. “అణచివేత ఎంత తీవ్రమైతే, తిరుగుబాటు కూడా అంతకుమించి ఉంటుంది” అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీకి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తనపై నమోదైన కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దాని పూర్వాపరాలపై ఇప్పుడే మాట్లాడబోనని స్పష్టం చేసిన అప్పలరాజు, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు మీడియా చేసిన ప్రయత్నం తనకు మరింత బలాన్ని ఇచ్చిందని అన్నారు.






