గన్నవరంలో సుగాలి ప్రీతి తల్లి పార్వతి మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యూట్యూబర్ ప్రశ్నా రావణ్ అరెస్ట్ నేపథ్యంలో స్పందించిన ఆమె, తన కుమార్తె సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోసం ఎన్నేళ్లుగా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి కేసు ఫైల్‌పైనే తన తొలి సంతకం ఉంటుందని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోలేదని ఆమె ఆరోపించారు. రెండేళ్లు గడిచినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదని విమర్శించారు.
ప్రశ్నా రావణ్‌ను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం చూపుతున్న చొరవను, ప్రజాధనాన్ని, పోలీసు బలగాలను సుగాలి ప్రీతి కేసు నిందితులను పట్టుకోవడంలో ఎందుకు వినియోగించడం లేదని ఆమె ప్రశ్నించారు. రావణ్ అరెస్టు కోసం వందలాది మంది పోలీసులను వినియోగిస్తుండగా, తన కుమార్తె కేసు నిందితులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు.
అలాగే, “లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు”, “ఆధారాలు లేవు” అనే కారణాలు చెబుతూ పవన్ కళ్యాణ్ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆమె విమర్శించారు. తన అంగవైకల్యాన్ని, కులాన్ని ఉద్దేశించి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, కొందరు ప్రజాప్రతినిధులు బాడీ షేమింగ్‌కు, వ్యక్తిగత అవమానాలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
2019 నుంచి 2024 వరకు తనతో కలిసి న్యాయం కోసం పోరాడి, హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట తప్పారని ఆరోపిస్తూ, గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయనున్నట్లు ప్రకటించారు. సుగాలి ప్రీతి కేసు నిందితులకు రాజకీయ అండ లభిస్తోందనే అనుమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు.
తన కుమార్తె మరణించి దాదాపు పదేళ్లు అవుతున్నా న్యాయం జరగలేదని, మరో తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో తన పోరాటం కొనసాగుతోందని పార్వతి తెలిపారు. తల్లుల కన్నీళ్లు ప్రభుత్వాలను కూల్చే శక్తిగా మారుతాయని హెచ్చరిస్తూ పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిపై తీవ్రంగా ద్వజమెత్తారు.






