తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)(TTD) ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) (Sri Venkateswara Institute of Medical Sciences – SVIMS), తిరుపతిలో మొత్తం 303 ప్రభుత్వ ఉద్యోగాల (Government Jobs) భర్తీకి మూడు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. జూనియర్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, క్లినికల్ సైకాలజిస్ట్, రిసెప్షనిస్ట్, ఎలక్ట్రిషియన్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జూలై 15 నుంచి ఆగస్టు 10 రాత్రి 11:59 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్విమ్స్ వెల్లడించింది.
అయితే ఈ నియామక ప్రక్రియపై టీటీడీ(TTD) మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakar Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. స్విమ్స్‌లో 303 పోస్టుల భర్తీని “మరో డీఎస్సీ స్కాం”గా (Another DSC Scam) అభివర్ణించిన ఆయన, మొత్తం నియామక ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించి కొందరికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకరరెడ్డి(Bhumana Karunakar Reddy), స్విమ్స్ బోర్డు లేదా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే విద్యార్హతలు, అనుభవ ప్రమాణాల్లో మార్పులు చేశారని ఆరోపించారు. నిపుణుల కమిటీ లేకుండానే సిలబస్ రూపొందించారని, ముందే ఎంపిక చేసిన అభ్యర్థులకు అనుకూలంగా నోటిఫికేషన్ రూపొందించారని, ప్రశ్నపత్రాల రూపకల్పనలో కూడా పక్షపాతం జరిగిందని అన్నారు.
సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సమీప బంధువు ఆదిశేషయ్య ఈ నియామకాల వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారని భూమన ఆరోపించారు. స్విమ్స్ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్‌ను పక్కన పెట్టి బర్డ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నియామక కమిటీ ఏర్పాటు చేశారని విమర్శించారు. గతంలో 100 మంది వైద్యుల నియామకాలలో కూడా కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయని, ఇప్పుడు 303 పోస్టుల భర్తీపైనా అదే తరహా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
బోర్డు అనుమతి లేకుండానే కొన్ని పోస్టుల వేతనాల్లో మార్పులు చేసి, కొందరికి ఉద్యోగాలు కల్పించేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నారని భూమన ఆరోపించారు. ఏపీపీఎస్సీ (APPSC) లేదా ఇతర స్వతంత్ర సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహించకుండా, ఎయిమ్స్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వంటి నిపుణుల సంస్థలను కూడా పక్కన పెట్టారని విమర్శించారు. సాంకేతిక పోస్టులకు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి జాతీయ స్థాయి సంస్థల నిపుణుల సలహా కూడా తీసుకోలేదని అన్నారు.
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా తుది ఎంపికను ఇంటర్వ్యూల ఆధారంగా చేసే విధానాన్ని తీసుకువచ్చి మెరిట్‌కు తూట్లు పొడిచారని భూమన ఆరోపించారు. ఇంటర్వ్యూల పేరుతో ఇష్టానుసారంగా ఎంపికలు చేసే అవకాశాన్ని కల్పించారని, ఇంజినీరింగ్ పోస్టుల భర్తీలో కూడా భారీ అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు.
మే నెలలో నిర్వహించిన 60 ఇంజినీరింగ్ పోస్టుల పరీక్షలకు సుమారు 34 వేల మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ, రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి కేవలం 18 వేల మందికే అవకాశం కల్పించారని భూమన ఆరోపించారు. ఒక్కో పోస్టును రూ.30 లక్షలకు విక్రయించారనే చర్చ జరుగుతోందని, 2023 నోటిఫికేషన్‌ను ప్రామాణికంగా తీసుకుని 2024, 2025 అభ్యర్థులకు అన్యాయం చేశారని విమర్శించారు.
వేదపారాయణం పోస్టుల భర్తీపైనా భూమన తీవ్ర ఆరోపణలు చేశారు. 700 వేదపారాయణ పోస్టులను ఒక్కోటి రూ.15 లక్షల చొప్పున విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పటికీ ఫలితాలు ప్రకటించలేదని అన్నారు. వేదాలపై సరైన అవగాహన లేని వ్యక్తులను నియమించే పరిస్థితి రావడం టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీటీడీలో(TTD) ఉద్యోగం అనేది సేవగా భావించే సంప్రదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని భూమన పేర్కొన్నారు. ఆరోపణలపై అధికారులు మౌనం పాటించడం అనుమానాలను మరింత పెంచుతోందని వ్యాఖ్యానించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి శ్రీవారి దర్శనంలో అవమానం జరిగిందని, శాసనమండలి సభ్యులకు కూడా తగిన గౌరవం దక్కడం లేదని విమర్శించారు.
స్విమ్స్, టీటీడీ నియామకాలపై వచ్చిన అన్ని ఆరోపణలపై స్వతంత్రంగా సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. పారదర్శకతతోనే టీటీడీ ప్రతిష్ట, భక్తుల విశ్వాసం, సంస్థ గౌరవం నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.







