అనంతపురం జిల్లా తాడిపత్రిలో (Tadipatri) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ (YSR Congress Party) ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి గంగులకుంట కేశవరెడ్డిపై (Gangulakunta Keshava Reddy) హత్యాయత్నం జరిగిందని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో టీ తాగుతున్న సమయంలో టీడీపీ(TDP) నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) అనుచరులు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఉద్రిక్తత అక్కడితో ఆగలేదని తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేశవరెడ్డిపై మరోసారి దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి (Hospital) ప్రాంగణంపై రాళ్లదాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బంది భయాందోళనలకు గురయ్యారని సమాచారం.
ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఆసుపత్రులపైనే దాడులు (Attacks) జరగడం పట్ల స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ విభేదాలు హింసాత్మక రూపం దాల్చి ఆసుపత్రుల వరకు చేరుకోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఈ ఘటనల సమయంలో పోలీసులు సమర్థంగా వ్యవహరించలేదని, ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని వైఎస్సార్సీపీ(YSRCP) శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.






