ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వ హయాంలో (Coalition Government) దళితులపై దాడులు (Dalits Attacks) పెరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు, వామపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రశ్నించిన ఓ దళితుడిపై టీడీపీ(TDP) నేతలు దాడి చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
అనంతపురం జిల్లా (Anantapur District) ఉరవకొండ నియోజకవర్గంలోని (Uravakonda Constituency) కూడేరు మండలం కలగళ్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోని ఈ గ్రామంలో, ఉపాధి హామీ పథకం (MGNREGA) పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేస్తున్నారని దళితుడు ఎర్రిస్వామి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టగా, విచారణ జరుగుతున్న సమయంలోనే టీడీపీ నేతలు ఈశ్వరయ్య(Eshwarayya), జయరాం(Jayaram) ఎర్రిస్వామిపై (Erriswamy) దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సమక్షంలోనే ఎర్రిస్వామిని చెంపదెబ్బ కొట్టిన ఘటన అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విచారణ అధికారుల ముందే దాడి జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, దళిత సంఘాలు (Dalit Organizations) డిమాండ్ చేస్తున్నాయి.







