తెలంగాణ రాష్ట్రంలో (Telangana state) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘జనగణన ప్రక్రియ’ (Census Process) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి (Bharati Holikeri) మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు. రేపటి నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సెల్ఫ్ ఎన్యుమరేషన్ (Self Enumeration) చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
సెల్ఫ్ ఎన్యుమరేషన్ అంటే ఏమిటి?
సాధారణంగా జనగణన సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. అయితే ఈసారి సాంకేతిక సౌకర్యంతో ప్రజలే తమ కుటుంబ వివరాలను ఆన్లైన్(Online) ద్వారా నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనినే సెల్ఫ్ ఎన్యుమరేషన్ అంటారు.
ప్రజలు దేశంలో ఎక్కడ ఉన్నా ఆన్లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే ఇది తప్పనిసరి కాదని, కేవలం ఒక ఎంపిక మాత్రమే అని స్పష్టం చేశారు.
33 ప్రశ్నలతో జనగణన
జనగణనలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే వారు 27 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వాలి. మిగిలిన 6 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను రెండో దశలో ఇంటికి వచ్చే సిబ్బందికి అందించాలి.
ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన వారికి ఒక రిఫరెన్స్ నంబర్ (Reference Number) ఇవ్వబడుతుంది. తర్వాత సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఆ నంబర్ చూపిస్తే సరిపోతుంది.
సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నా, చేయకపోయినా రెండో దశలో సిబ్బంది ప్రతి ఇంటికీ రావడం తప్పనిసరి. ఆన్లైన్లో నమోదు చేయని కుటుంబాల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తారు.
ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఖచ్చితమైన వివరాలు అందించాలని అధికారులు కోరుతున్నారు.






