ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) దేవాలయాల నిధులు(Temples Funds), ఆస్తులపై ఇటీవల జరుగుతున్న చర్చ రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)(TTD) మిగులు నిధులను ప్రభుత్వ ట్రెజరీకి (Government Treasury) మళ్లించిన ఘటనను గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలకు ప్రభుత్వం సిద్ధమవుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
1980వ దశకంలో సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (State Financial Situation) ఒత్తిడి పెరగడంతో, వాణిజ్య బ్యాంకుల్లో ఉన్న టీటీడీ(TTD) మిగులు నిధులను ప్రభుత్వ ట్రెజరీకి బదిలీ చేయాలని ఎన్టీఆర్ ప్రభుత్వం (NTR Government) నిర్ణయించింది. ప్రభుత్వం సమానమైన వడ్డీ చెల్లిస్తుందని ప్రకటించినప్పటికీ, ఈ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఆ సమయంలో కంచి శంకరాచార్య (Kanchi Shankaracharya) జయేంద్ర సరస్వతి (Jayendra Saraswathi) ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ(BJP) నాయకుడు వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) దీనిని హిందూ మత సంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంగా అభివర్ణించగా, జనతా పార్టీ నేత జైపాల్ రెడ్డి (Jaipal Reddy) కూడా మత సంస్థల నిధులను ప్రభుత్వం ముట్టుకోకూడదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, సుమారు రూ.33 కోట్లను ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేశారు. అనంతరం 1984లో నాదెండ్ల భాస్కరరావు ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ఇక ప్రస్తుతం ఈనాడు పత్రికలో ప్రచురితమైన కథనాల ప్రకారం, టీటీడీని(TTD) మినహాయించి రాష్ట్రంలోని సుమారు 27,750 దేవాలయాలు, ధార్మిక సంస్థల వద్ద భారీ స్థాయిలో ఆస్తులు, నిధులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో రూ.2,763.77 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 981 కిలోల బంగారు ఆభరణాలు, గోల్డ్ బాండ్ల రూపంలో మరో 853 కిలోల బంగారం, 32,622 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొంది. అలాగే దేవాలయాల ఆదాయం 2023-24లో రూ.1,379.19 కోట్ల నుంచి 2025-26 నాటికి రూ.1,503.90 కోట్లకు పెరుగుతుందని కూడా ఆ కథనంలో వెల్లడించింది.
అయితే, ఈ గణాంకాల ప్రచురణ వెనుక ఉద్దేశ్యంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో నిధుల కొరత ఉందని ప్రభుత్వం పలుమార్లు పేర్కొంటున్న నేపథ్యంలో, గతంలో ఎన్టీఆర్ తీసుకున్న తరహాలోనే దేవాలయాల నిధులను ప్రభుత్వ ట్రెజరీకి మళ్లించే ఆలోచన ఏదైనా ఉందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అలాగే, ముందుగా మీడియా కథనాల ద్వారా ఒక అంశాన్ని ప్రజల్లో చర్చకు తీసుకువచ్చి, ఆ తర్వాత దానికి అనుకూల వాతావరణం సృష్టించి విధాన నిర్ణయాలు అమలు చేయడం అనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈనాడు పత్రికలో దేవాలయాల నిధుల వివరాలను విస్తృతంగా ప్రచురించారా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.






