తెలుగు సంవత్సరంలో (Telugu Year) పండగల సందడి మొదలయ్యే తొలి శుభదినం తొలి ఏకాదశి (First Ekadashi). ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశిని శయని ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు పాలకడలిలో శేషతల్పంపై (Adishesha) 4 నెలల పాటు యోగనిద్రలోకి వెళ్తాడని భక్తుల విశ్వాసం. ఈ కాలాన్నే చాతుర్మాస వ్రతంగా భావిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు యోగనిద్ర నుంచి మేల్కొంటారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ 4 నెలల పాటు భక్తులు ఉపవాసాలు, జపాలు, ధ్యానాలు, విష్ణు నామస్మరణతో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తారు. తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును (Lord Vishnu) భక్తిశ్రద్ధలతో పూజించి దానధర్మాలు చేస్తే పాప విమోచనం కలిగి మోక్షప్రాప్తి లభిస్తుందని పురాణ విశ్వాసం. అందుకే ఈ రోజును వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దినంగా భావిస్తారు.
తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా సమర్పించే నైవేద్యం పేలాల పిండి ప్రసాదం. జొన్న పేలాలను బెల్లం, యాలకులు, మిరియాల పొడితో కలిపి తయారు చేసి శ్రీమహావిష్ణువుకు (Lord Vishnu) సమర్పిస్తారు. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే ఆహారం. వర్షాకాలం ప్రారంభంలో జీర్ణశక్తి తగ్గే సమయంలో జొన్నలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. బెల్లం శరీరానికి శక్తిని, ఐరన్‌ను అందిస్తే, మిరియాలు శరీరంలో వేడిని పెంచి జలుబు, కఫం వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. మన పూర్వీకులు ఆచారాల్లోనే ఆరోగ్య రహస్యాలను దాచారనే చెప్పాలి.
గ్రామీణ ప్రాంతాల్లో తొలి ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది. రైతన్నలు(Farmers) దీనిని తమ తొలి పండగగా జరుపుకుంటారు. వర్షాలు మొదలయ్యే ఈ సమయంలో భూమాతకు, శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేసి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. పంటలు సమృద్ధిగా పండాలని, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారు. రోజంతా ఉపవాసం పాటించి రాత్రి జాగరణ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆధ్యాత్మికత, ఆరోగ్యం, ప్రకృతితో అనుబంధాన్ని గుర్తు చేసే మహత్తర పండగే తొలి ఏకాదశి.







