తిరుమల కొండపై (Tirumala Hill) కలకలం రేపిన అంజనేయస్వామి (Lord Hanuman) విగ్రహం చోరీ కేసు (Idol Theft Case) దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులోని (Ghat Road) ఏడో మైలు వద్ద ఉన్న హనుమాన్ చిన్న విగ్రహాన్ని అపహరించిన వ్యక్తిని పోలీసులు రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం.
దర్యాప్తు ప్రకారం, నిందితుడు విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా భీమిలి (Bheemili) నియోజకవర్గంలోని టి. నగరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ (TDP) నేత పొట్నూరు యశ్వంత్ (Potnuru Yashwanth) అని తేలినట్లు తెలుస్తోంది. యశ్వంత్‌కు టీడీపీలోని కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, నారా లోకేష్(Nara Lokesh), గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సహా పలువురు పార్టీ నేతలతో దిగిన ఫోటోలు వెలుగులోకి రావడం ఈ కేసుకు మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది.
ఈ నేపథ్యంలో గతంలో దేవాలయాలపై జరిగిన వివాదాస్పద ఘటనలు కూడా మళ్లీ చర్చకు వస్తున్నాయి. టెక్కలి పరిధిలోని సంతబొమ్మాలి మండలంలో ఉన్న పాలేశ్వరస్వామి ఆలయంలో (Paleswara Swamy Temple) నంది విగ్రహం తొలగింపు ఘటనలో స్థానిక తెలుగుదేశం నేతలు సీసీటీవీ ఆధారాలతో పట్టుబడ్డారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
అలాగే రామతీర్థం ఆలయంలో (Ramatheertham Temple) రాముడి విగ్రహం ధ్వంసం కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న వ్యక్తికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షల సాయం అందించడం కూడా అప్పట్లో వివాదానికి దారితీసింది. అదే విధంగా రాజమండ్రిలో (Rajahmundry) సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం చేయాలని పూజారికి రూ.30 వేలు ఇచ్చినట్లు టీఎన్టీయూసీ (TNTUC) మాజీ నాయకుడిపై ఆరోపణలు రావడం గుర్తు చేస్తున్నారు.
ఇలాంటి పలు ఘటనలను ప్రస్తావిస్తూ, దేవాలయాలపై దాడులు రాజకీయ కుట్రల భాగమా? తిరుమల విగ్రహం చోరీ వెనుక కూడా అలాంటి కోణం ఉందా? అన్న అనుమానాలను పూర్తిస్థాయిలో విచారించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల వంటి అత్యంత పవిత్ర క్షేత్రంలో జరిగిన ఈ ఘటనపై నిజానిజాలు వెలుగులోకి రావాలని రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.







