తిరుమల (Tirumala) శ్రీవారి క్షేత్రంలో (Sri Venkateswara Temple) ధూమపానం(Smoking), మద్యం (Alcohol) వంటి వాటిపై నిషేధం ఉన్నప్పటికీ మెట్ల మార్గంలో (Footpath) ఓ వ్యక్తి సిగరెట్ (Cigarette) తాగుతూ కనిపించడం భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలు ఎలా జరుగుతున్నాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత వ్యక్తిపై, భద్రతా విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో తిరుమలలో మద్యం సేవించి గొడవలకు పాల్పడటం, నిషేధిత వస్తువులతో కొండపైకి రావడం, భక్తుల ముసుగులో కొందరు ఆకతాయిలు రీల్స్ చేయడం వంటి ఘటనలపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. పార్కింగ్ వివాదంలో డ్రైవర్ శివ మృతి, మాడవీధుల్లో మద్యం సేవించి మహిళతో గొడవకు దిగిన ఘటన, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు చెప్పులతో(Footwear) వచ్చిన భక్తులను సకాలంలో అడ్డుకోలేకపోయారనే విమర్శలు, నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వ్యవహారం వంటి ఘటనలను భక్తులు ప్రస్తావిస్తున్నారు.
తిరుమల పవిత్రత, భద్రత విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భద్రతా వ్యవస్థలో (Security System) లోపాలను గుర్తించి సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు.






