వైఎస్సార్సీపీ(YSRCP) రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (Thopudurthi Prakash Reddy) టీడీపీ(TDP) ఎమ్మెల్యేలు పరిటాల సునీత(Paritala Sunitha), అమిలినేని సురేంద్ర బాబులపై (Amineni Surendra Babu) తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో “రెడ్ బుక్”(Red Book) అరాచకాలు తీవ్ర స్థాయికి చేరాయని విమర్శించారు.
శింగనమల సమీపంలో తన వాహనాన్ని ఢీకొట్టి హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. తన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. తమ వాహనం వైపు దూసుకొచ్చిన టిప్పర్ టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు (Amineni Surendra Babu) చెందినదేనని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కనుసన్నల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనకు పదేళ్లుగా ఉన్న గన్మెన్ భద్రతను తొలగించారని అన్నారు.
శత్రువుల నుంచి తనకు ప్రాణహాని ఉన్న కారణంగానే గత పదేళ్లుగా భద్రత కల్పించారని గుర్తు చేశారు. అలాగే, తన సోదరుడు తోపుదుర్తి రాజాపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆరోపించారు. హత్యలు చేయించడం, అక్రమ కేసులు బనాయించడమే మంత్రి నారా లోకేష్ రాజకీయ నైజమా? అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.






