అనంతపురం(Anantapur) జిల్లా పామిడి మండలం పొగురూరు(Pogururu) సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Major Road Accident) చోటుచేసుకుంది. పొగురూరు బ్రిడ్జిపై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును(Private Travels Bus) ఐషర్ వాహనం(Eicher Vehicle) ఢీకొట్టడంతో రెండు వాహనాలు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందకు పడిపోయాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నిద్రమత్తులో(Sleepy) ఉండటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాద తీవ్రతతో పలువురు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి, గాయపడిన వారిని చికిత్స కోసం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు కొద్దిసేపటి తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై విచారణ కొనసాగుతోంది.






