---Advertisement---

ఉదయనిధి స్టాలిన్ మరోసారి ‘సనాతన’ వ్యాఖ్యలు.. అధికారం పోయినా మారని డీఎంకే వైఖరి!

May 12, 2026

---Advertisement---

తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో డీఎంకే (DMK) పార్టీ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత కూడా ఆ పార్టీ నేతల వైఖరిలో మార్పు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మరోసారి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గతంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలతో వివాదాల్లో నిలిచిన ఆయన.. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ వేదికగా అదే వ్యాఖ్యలను మరోసారి పునరావృతం చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

గత ఎన్నికల్లో డీఎంకే పార్టీకి ఎదురైన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా హిందూ భావజాలాన్ని దెబ్బతీసేలా వచ్చిన వ్యాఖ్యలు కూడా కీలక పాత్ర పోషించాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఉదయనిధి స్టాలిన్ తన ధోరణిని మార్చుకోకుండా మళ్లీ అదే అంశాన్ని లేవనెత్తడం గమనార్హం.

మంగళవారం తమిళనాడు శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్.. “మనుషుల మధ్య విభజనలు సృష్టించే సనాతన ధర్మాన్ని అంతం చేయాల్సిందే” అంటూ వ్యాఖ్యానించారు. గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకుంటూ తన పాత నినాదాన్నే అసెంబ్లీలో పునరుద్ఘాటించారు. ఆయన వ్యాఖ్యలతో సభలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అదే సమయంలో సభలో రాజకీయ హుందాతనం కొనసాగాలని కూడా ఉదయనిధి సూచించారు. “కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు మా నాయకుడితో పాటు పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అలాంటి రాజకీయ మర్యాదలు ఈ సభలోనూ కొనసాగాలి. అధికార, ప్రతిపక్ష సభ్యులుగా వేర్వేరు వరుసల్లో కూర్చున్నా.. తమిళనాడు అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలి” అని అన్నారు. సభలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు.

ఇక తమిళనాడు రాష్ట్ర గీతానికి ఇచ్చిన ప్రాధాన్యంపై కూడా ఉదయనిధి అభ్యంతరం వ్యక్తం చేశారు. “వందేమాతరం (Vande Mataram) తర్వాత రాష్ట్ర గీతాన్ని ఆలపించడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వందేమాతరం వినిపించలేదు. కానీ ఇక్కడ మాత్రం ప్లే చేశారు. అక్కడ గవర్నర్ ఎవరో మీకు తెలుసు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదు. తమిళనాడు రాష్ట్ర గీతం ఎప్పటికీ రెండో స్థానంలో ఉండకూడదు” అంటూ వ్యాఖ్యానించారు.

ఉదయనిధి స్టాలిన్ తాజా వ్యాఖ్యలు మరోసారి జాతీయ రాజకీయాల్లో సనాతన ధర్మం అంశాన్ని వేడెక్కించాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి తర్వాత కూడా డీఎంకే నేతల్లో మార్పు రాకపోవడం ప్రజల్లో మరింత అసంతృప్తికి దారితీస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment