తమిళనాడులో (Tamil Nadu) గత 6 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో నెలకొన్న అనిశ్చితి ముగియడంతో టీవీకే(TVK) శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వీసీకేకు(VCK) చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్(Thol. Thirumavalavan) అధికారికంగా మద్దతు లేఖను టీవీకే నేత ఆధవ్ అర్జునకు (Aadhav Arjuna) అందజేశారు. దీంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే బలం 118కి చేరింది. ఈ పరిణామంతో ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
మద్దతు సంఖ్య పెరగడంతో విజయ్(Vijay) త్వరలోనే తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్(Rajendra Arlekar)ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు లేఖలను సమర్పించనున్నట్లు సమాచారం. గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేస్తే విజయ్ను అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు గవర్నర్ అర్లేకర్ ఈరోజు సాయంత్రం కేరళ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ రాత్రే విజయ్ ప్రమాణస్వీకారం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారకముందే ప్రమాణస్వీకారం పూర్తి చేయడం మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ వెంటనే ఆహ్వానం ఇవ్వలేదు. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో టీవీకే బలం 116కు చేరినా మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా రెండు స్థానాలు తక్కువగా ఉండటంతో ఉత్కంఠ కొనసాగింది.
మొదట మద్దతు ఇస్తామని సంకేతాలు ఇచ్చిన వీసీకే చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. అయితే తాజా నిర్ణయంతో వీసీకే మళ్లీ విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో రాజకీయ సంక్షోభానికి ఫుల్స్టాప్ పడింది. దీంతో టీవీకే శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి.






