పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీలిమిటేషన్ (Delimitation) అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026 పై దక్షిణాది రాష్ట్రాలు (Southern States) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే ప్రతిపాదనతో వచ్చిన ఈ సవరణ బిల్లుపై తాజాగా టీవీకే(TVK) అధ్యక్షుడు విజయ్ (Vijay) తీవ్రంగా స్పందించారు. ఈ ప్రతిపాదన పక్షపాత చర్యగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు (Women) 33 శాతం రిజర్వేషన్ (Reservation) ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమే అయినా, డీలిమిటేషన్ అమలు వల్ల దక్షిణ, ఉత్తర రాష్ట్రాల మధ్య అసమానతలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ బిల్లుతో దక్షిణ రాష్ట్రాల ప్రతినిధిత్వం తగ్గిపోతుందని, ఉత్తర రాష్ట్రాల ప్రభావం పెరిగే అవకాశముందని విజయ్ అన్నారు. భాష, సంస్కృతి, రాష్ట్ర హక్కుల విషయంలో దక్షిణ రాష్ట్రాల స్వరం బలహీనపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం (Tamil Nadu State) తీవ్రంగా ప్రభావితమవుతుందని హెచ్చరించారు.
ఇక ఈ సవరణ బిల్లు ఆమోదం పొందితే కేంద్ర విధానాలను అనుసరించే రాష్ట్రాలకు ఇది శిక్షలా మారుతుందని, అనుసరించని రాష్ట్రాలకు మాత్రం ప్రోత్సాహంగా ఉంటుందని విమర్శించారు. పార్లమెంట్ నియోజకవర్గాల మార్పులు ఆర్థిక పంపిణీపై కూడా ప్రభావం చూపవచ్చని చెప్పారు.
ఇప్పటికే కేంద్ర నిధుల విషయంలో తమిళనాడు నష్టపోతున్నదని, బడ్జెట్ కేటాయింపుల్లో సరైన ప్రాధాన్యం లభించడం లేదని విజయ్ ఆరోపించారు. డీలిమిటేషన్ అమలు తర్వాత జనాభా ఆధారిత పథకాల కింద వచ్చే నిధులు మరింత తగ్గే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, ప్రస్తుత వ్యవస్థనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ కోరారు.






