---Advertisement---

విశాఖ డేటా సెంటర్: ప్రాజెక్టు వెనుక ఉన్న వాస్తవాలు, ఒప్పందాలు – క్రెడిట్ ఎవరికి చెందుతుంది?

April 28, 2026

---Advertisement---

విశాఖపట్నంలో (Visakhapatnam) గూగుల్ (Google)–అదానీ డేటా సెంటర్ (Adani Data Center) ప్రారంభోత్సవం సందర్భంగా, ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న వాస్తవాలు, ఒప్పందాలు మరియు క్రెడిట్ రాజకీయాలపై లోతైన విశ్లేషణ అవసరం అనే చర్చ జనబాహుళ్యంలో ప్రారంభమైంది. నేడు విశాఖపట్నంలో ప్రారంభమవుతున్న గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) రాష్ట్ర ఐటీ రంగంలో ఒక మైలురాయిగా చెప్పడంలో సందేహం లేదు. అయితే, ఈ ప్రాజెక్టు కేవలం నేటి కూటమి ప్రభుత్వ కృషి వల్ల రాత్రికి రాత్రే వచ్చినది కాదని చెప్పాలి. దీని వెనుక వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలో వేసిన బలమైన పునాదులు, అదానీ గ్రూప్‌తో జరిగిన కీలక ఒప్పందాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

విశాఖను (Vizag) పరిపాలనా రాజధానిగా(Administrative Capital) మార్చి అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం (Jagan Government) 2020 నుంచే అడుగులు వేసిందనేది స్పష్టం. ఇందులో భాగంగా, నవంబర్ 2020లో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్‌తో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అనంతరం, కోవిడ్ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత 2023 మే 3న విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా శంకుస్థాపన చేశారు. ఆ సమయంలోనే ఈ ప్రాజెక్టు కోసం మధురవాడ, కాపులుప్పాడ ప్రాంతాల్లో సుమారు 190 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.

అలాగే, ఈ డేటా సెంటర్ విజయవంతం కావాలంటే సముద్ర గర్భం ద్వారా వచ్చే కేబుల్ కనెక్టివిటీ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో, 2021 మార్చి 9న సింగపూర్ నుంచి విశాఖకు 3,900 కిలోమీటర్ల పొడవున సబ్‌సీ కేబుల్ వేయడానికి సహకారం అందించాలని జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది. ఈ కేబుల్ వ్యవస్థ లేకపోతే డేటా ట్రాఫిక్ సాధ్యం కాదని, అది లేకుండా గూగుల్ వంటి సంస్థలు రాకపోవచ్చని నిపుణులు అప్పుడే అభిప్రాయపడ్డారు. ఈ సబ్‌సీ కేబుల్ వ్యవస్థ విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషించారు.

ఇక అదానీ–గూగుల్ సంబంధాలను పరిశీలిస్తే, విశాఖకు గూగుల్ రావడానికి అదానీ గ్రూప్‌తో ఆ సంస్థకు ఉన్న వ్యాపార సంబంధాలే ప్రధాన కారణమని తెలుస్తుంది. 2022 అక్టోబర్ 11న నోయిడాలో అదానీ నిర్మించిన డేటా సెంటర్‌లో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ ఒప్పందం ద్వారా అదానీ నిర్మించిన మౌలిక సదుపాయాలను గూగుల్ క్లయింట్‌గా వినియోగించడం ప్రారంభించింది. విశాఖలో కూడా రూ. 87,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను నిర్మిస్తోంది అదానీ సంస్థే; గూగుల్ కేవలం తన సాంకేతికత (హార్డ్‌వేర్) అందిస్తోంది.

ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) ఈ ప్రాజెక్టు పూర్తిగా తమ వల్లే వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు అందుకు విరుద్ధంగా ఉన్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2025 అక్టోబర్ 11న ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ పేరుతో జీవో జారీ చేసి, అందులో అదానీ పేరు ప్రస్తావించకుండా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసిందని విమర్శలు వినిపించాయి. అయితే, 2025 డిసెంబర్ 2న గూగుల్ సంస్థ భూమిని అదానీకే బదలాయించాలని లేఖ రాయడంతో, ప్రభుత్వం 480 ఎకరాల భూమిని అదానీ ఇన్ఫ్రా పేరుకు మార్చుతూ సవరణ జీవో జారీ చేయాల్సి వచ్చింది. దీంతో గతంలో విమర్శించిన అదానీకి భూమి ఇవ్వాల్సి రావడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయటపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani), సీఎం చంద్రబాబు (Chandrababu) సమక్షంలోనే గూగుల్‌తో కలిసి తామే ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని ప్రకటించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఈ ప్రాజెక్టు జగన్ హయాంలో ప్రారంభమైనప్పటికీ, కొన్ని కీలక అంశాలలో ప్రస్తుత ప్రభుత్వం తగిన పట్టుదల చూపలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. డేటా సెంటర్ల ద్వారా నేరుగా లభించే ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో, జగన్ ప్రభుత్వం డేటా సెంటర్‌తో పాటు ఐటీ పార్క్‌లు, స్కిల్ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని ఒప్పందంలో ప్రస్తావించినప్పటికీ, ఆ అంశాలపై ప్రస్తుత ప్రభుత్వం తగిన దృష్టి పెట్టలేదని విమర్శలు ఉన్నాయి. ఫలితంగా సుమారు 25,000 ఉద్యోగాల అవకాశాలు కోల్పోయినట్లయ్యిందని అంటున్నారు.

మొత్తంగా చూస్తే, విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు పునాది జగన్ ప్రభుత్వ కాలంలోనే పడింది అనడం కాదనలేని నిజం. అయితే, క్రెడిట్ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఇది తమ కృషి ఫలితంగా అనే ప్రచారం చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఉపాధి అవకాశాలపై దృష్టిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించి ఉంటే, ఆంధ్రప్రదేశ్ యువతకు మరింత మేలు జరిగేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment