---Advertisement---

సముద్రంలో గల్లంతైన మత్స్యకారులపై మంత్రి వ్యాఖ్యలతో ఉద్రిక్తత.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై విశాఖ హార్బర్‌లో ఆందోళన!

July 8, 2026

Summarize with AI

---Advertisement---

విశాఖపట్నం (Visakhapatnam) తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో (Boat Accident) ఆరుగురు మత్స్యకారులు (Fishermen) గల్లంతైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషాద ఘటన అనంతరం ప్రభుత్వం, అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరుపై మత్స్యకార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించకపోవడం, కీలకమైన సమయం వృథా చేయడం వల్లే ప్రాణనష్టం పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జూలై 4న మధ్యాహ్నం సుమారు 3:30 గంటలకు బోటు ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందింది. సాయంత్రానికే రెవెన్యూ శాఖకు, అనంతరం మెరైన్ అధికారులకు (Marine Officials) విషయం తెలిసినా, మరుసటి రోజు ఉదయం వరకు రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) ప్రారంభం కాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు కారి చిన్నా తెలిపిన వివరాల ప్రకారం, సమయానికి సహాయక చర్యలు జరిగి ఉంటే మరికొంత మంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేదని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ “8 గంటల జాప్యం” ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటన అనంతరం ప్రభుత్వ పెద్దల వ్యాఖ్యలు కూడా బాధిత కుటుంబాల ఆవేదనను మరింత పెంచాయి. గల్లంతైన మత్స్యకారులు “ఇక లేరని నిర్ధారించాం” అని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) చేసిన వ్యాఖ్యలు కుటుంబ సభ్యుల్లో తీవ్ర మనోవేదన కలిగించాయి. తమ వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడాన్ని మత్స్యకారులు తీవ్రంగా తప్పుబట్టారు.

ఇక ఫిషరీస్ కమిషనర్ గాలింపు చర్యలను జూలై 7 సాయంత్రానికే ముగిస్తామని ప్రకటించడంపై కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధిత కుటుంబాల ఆందోళనలతో గడువును అర్ధరాత్రి వరకు పొడిగించినప్పటికీ, అది కేవలం నామమాత్రంగానే సాగిందని మత్స్యకార సంఘాలు ఆరోపిస్తున్నాయి. 72 గంటల గాలింపు తర్వాత కోస్ట్ గార్డ్ కూడా ఆచూకీ లభించలేదని ఆపరేషన్ నిలిపివేయడం మరింత అసంతృప్తికి దారితీసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) కాన్వాయ్‌ను మత్స్యకారులు, మహిళలు(Womens) అడ్డుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియకముందే గాలింపు నిలిపివేయడంపై ఆగ్రహంతో మహిళలు మంత్రి వాహనాన్ని చుట్టుముట్టగా, వారిని పోలీసులు బలవంతంగా పక్కకు తొలగించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, రాత్రిపూట అత్యవసర గాలింపు చేపట్టకపోవడం అధికారుల వైఫల్యమని మత్స్యకార వర్గాలు ఆరోపిస్తున్నాయి. గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగించాలని, బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment