---Advertisement---

అమరావతిని కాదు… భూ దోపిడినే జగన్ వ్యతిరేకించారు? అసలు నిజం ఇదే!

June 30, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గడియకోసారి మాట మార్చుతున్నారని అధికార పార్టీ వర్గాలు చేస్తున్న ప్రచారం అసత్యాలు, అర్థసత్యాలు మాత్రమే అని రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట. మొదటి నుంచీ జగన్‌ వైఖరి భూదోపిడీకే వ్యతిరేకంగా ఉందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజధాని ఏర్పాటు విషయంలో కాకుండా, రైతుల సారవంతమైన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడం, భారీ ఆర్థిక భారంతో కూడిన నిర్మాణ విధానాన్నే ఆయన మొదటి నుండి వ్యతిరేకించారనే వాదన వినిపిస్తోంది.

2014 జూన్ 8న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, అదే ఏడాది సెప్టెంబర్ 4న విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని జగన్ స్వాగతిస్తూ, ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన సుమారు 30 వేల ఎకరాల భూమి ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మించాలని సూచించారు. అప్పటివరకు 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ ప్రతిపాదన ముందుకు రాలేదు.అయితే ఈ ఘటననే ప్రస్తావిస్తూ జగన్ అమరావతి ప్రాంతాన్ని అసెంబ్లీలో సమర్థించారని అధికార పార్టీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, అమరావతి అనే పేరే అప్పటివరకు అసెంబ్లీలో ప్రస్తావనకు రాలేదని పలువురు గుర్తు చేస్తున్నారు.

అయితే 2014 డిసెంబర్ 22న విజయవాడ–గుంటూరు మధ్య కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతుల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందని, నయా జమీందార్లను తయారు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం డిసెంబర్ 30న ఏపీ సీఆర్డీఏ చట్టం అమల్లోకి రాగా, 2015 ఏప్రిల్ 1న ఆ 29 గ్రామాలకు ‘అమరావతి’ అనే పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

2015 అక్టోబర్ 22న అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా జగన్ బహిష్కరించారు. రైతుల సారవంతమైన పంట భూముల్లో రాజధాని నిర్మాణాన్ని ఆయన వ్యతిరేకించినట్లు అప్పట్లో స్పష్టం చేశారు.

2019లో అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయాలనే మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఆయన ప్రభుత్వం వాదించింది. అయితే ఆ ప్రతిపాదనలో అమరావతి కూడా ఒక రాజధాని అనే విషయాన్ని దాచి జగన్ రాజధాని మార్చేస్తున్నాడనే భారీ ప్రచారానికి తెరలేపారని గుర్తు చేస్తున్నారు.

ఆర్థిక అంశాల పరంగా కూడా అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ అనేక సందేహాలు వ్యక్తం చేశారు. కోర్ క్యాపిటల్ నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ప్రపంచ బ్యాంకు, నాబార్డ్ వంటి సంస్థల నుంచి భారీ రుణాలు తీసుకోవడం రాష్ట్ర భవిష్యత్తుపై భారంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ తగ్గుతున్న పరిస్థితుల్లో విదేశీ రుణాల చెల్లింపులు రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతాయని కూడా పేర్కొన్నారు. పంట భూముల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు భారీ వ్యయం అవుతుందని అంచనా వేస్తూ, మొత్తం ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక సామర్థ్యాన్ని మించిపోతుందని ఆయన వాదించారు. ఆ వాదన కాదనలేని సత్యం అని ఆర్ధిక నిపుణుల నుండి వినిపించిన మాట.

అయితే ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ తన అభిప్రాయంగా రాష్ట్రానికి భారంగా ఉన్న బ్రౌన్ ఫీల్డ్ రాజధాని విధానంపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి సూచన చేశారు . ఈ నేపథ్యంలో సీఆర్డీఏ పరిధిలోనే ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్‌ను అభివృద్ధి చేసి తక్కువ వ్యయంతో రాజధాని నిర్మించవచ్చని సూచించారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చని ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో అమరావతి విస్తరణ, రెండో విడత భూసేకరణ అవసరంపై వస్తున్న ప్రతిపాదనల నేపథ్యంలో కూడా గత హామిలు, ప్రస్తుత ప్రణాళికల మధ్య వ్యత్యాసాలపై చర్చ కొనసాగుతోంది. గతంలో 33 వేల ఎకరాల్లో సింగపూర్ తరహా రాజధాని కడతామని చెప్పిన వారు, ఇప్పుడు అదే 33 వేల ఎకరాలు కేవలం ఒక మున్సిపాలిటీకే సరిపోతాయని, మళ్ళీ రెండో విడత భూసేకరణ చేయాలని చెప్పడం ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. వరద ముంపు నివారణ పేరుతో చేపడుతున్న ప్రాజెక్టుల వ్యయంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ఒక భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ గా ఉందని ప్రజారాజధానిగా ఏమాత్రం లేదని పలువురు చెబుతున్న మాట.

మొత్తం మీద, జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ఏర్పాటును వ్యతిరేకించలేదని, రైతుల భూముల బలవంతపు సేకరణను మరియు రాష్ట్ర ఆర్థిక స్థోమతకు మించిన వ్యయంతో కూడిన నమూనాను మాత్రమే వ్యతిరేకించారని ఆయన అనుచరులు, పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని అసెంబ్లీలో సమర్ధించారని చెబుతున్న మాట దగ్గర నుండి తాను ఆ ప్రాంతానికి పూర్తిగా వ్యతిరేకం అనే ప్రచారం వరకు రాజకీయ కోణంలో జగన్ కు వ్యతిరేకంగా నిర్మించిన ఒక దుష్ప్రచారం మాత్రమే అని పలువురు చర్చను తేవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment