వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) మంగళవారం ఒంగోలులో(Ongole) పర్యటించారు. ఒంగోలు క్లౌపేటలోని వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్ దివంగత కాకుమాను రాజశేఖర్ (Late Kakumanu Rajasekhar) నివాసానికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.
కాకుమాను రాజశేఖర్ పార్టీకి అందించిన సేవలను వైయస్ జగన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పార్టీ పట్ల నిబద్ధతతో, అంకితభావంతో పనిచేసిన ఆయన మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
రాజశేఖర్ కుటుంబం ఒంటరిది కాదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి వారికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.





