---Advertisement---

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక హీట్.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో జోరుగా చర్చ!

June 26, 2026

Summarize with AI

---Advertisement---

తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) అసెంబ్లీ ఉపఎన్నిక (Assembly (By-election) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డీఎంకే(DMK) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌ను (M.K. Stalin) ఈ స్థానంలో పోటీ చేయించాలని పార్టీ శ్రేణుల నుంచి గట్టిగా డిమాండ్ వినిపిస్తోంది. స్టాలిన్ మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు భావిస్తుండటంతో ఈ ఉపఎన్నికకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై డీఎంకే అధిష్ఠానం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ చెన్నైలోని కొలత్తూరు (Kolathur) నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దీంతో ప్రస్తుతం ఆయన శాసనసభ (Legislative Assembly) వెలుపలే ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతలు ఆయనను తిరిగి అసెంబ్లీలోకి తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారు.

తిరుచ్చి ఈస్ట్ స్థానం ఖాళీ కావడానికి ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) తీసుకున్న నిర్ణయమే కారణమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ 2 నియోజకవర్గాలైన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయం సాధించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒకే స్థానాన్ని కొనసాగించాల్సి ఉండటంతో ఆయన పెరంబూర్ స్థానాన్ని కొనసాగిస్తూ తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే తిరుచ్చి దక్షిణ జిల్లా డీఎంకే(DMK) కార్యవర్గం ప్రత్యేక సమావేశం నిర్వహించి స్టాలిన్‌ను తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో అభ్యర్థిగా నిలబెట్టాలని తీర్మానం చేసింది. ఈ ప్రతిపాదనకు మాజీ మంత్రులు కే.ఎన్. నెహ్రూ(K.N. Nehru), అన్బిల్ మహేష్ పొయ్యామొళి (Anbil Mahesh Poyyamozhi) వంటి కీలక నేతలు కూడా మద్దతు తెలుపుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇటీవల మాజీ మంత్రి, తిరుచ్చి వెస్ట్ ఎమ్మెల్యే కే.ఎన్. నెహ్రూ మాట్లాడుతూ స్టాలిన్ త్వరలోనే తమిళనాడు అసెంబ్లీలోకి తిరిగి వస్తారని వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో తిరుచ్చి ఈస్ట్ నుంచే స్టాలిన్ బరిలోకి దిగే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో మరింత చర్చ మొదలైంది.

ప్రస్తుతం తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికకు సంబంధించి డీఎంకే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. స్టాలిన్ స్వయంగా ఎన్నికల బరిలోకి దిగుతారా, లేక పార్టీ మరో నేతకు అవకాశం కల్పిస్తుందా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. డీఎంకే అధిష్ఠానం తీసుకునే తుది నిర్ణయంపై తమిళనాడు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment