తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) మరోసారి వేడెక్కాయి. డీఎంకే(DMK) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (M.K. Stalin) చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి(CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం (TVK Government) తన 5 సంవత్సరాల పూర్తి పదవీకాలాన్ని కొనసాగించే అవకాశం చాలా తక్కువగా ఉందని స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
ఒక కార్యక్రమంలో ప్రసంగించిన స్టాలిన్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్న టీవీకే(TVK) ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో ఏర్పడలేదని గుర్తు చేశారు. తమిళనాడు అసెంబ్లీలో (Assembly) ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాలు టీవీకేకు రాలేదని, ఆ పార్టీ కేవలం 108 స్థానాలకే పరిమితమైందని తెలిపారు. డీఎంకే కూటమిలో ఉన్న కొన్ని పార్టీల మద్దతుతోనే విజయ్ ప్రభుత్వం ఇప్పటివరకు కొనసాగుతోందని ఆరోపించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పడం కష్టమని స్టాలిన్ అన్నారు. 3 నెలల్లోనైనా, 6 నెలల్లోనైనా రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే డీఎంకే నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే 59 స్థానాలు, ఏఐఏడీఎంకే 47 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌తో (Congress) పాటు ఇతర పార్టీలు కలిపి 20 స్థానాలను దక్కించుకున్నాయి. అనంతరం కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వీసీకే(VCK), ఐయూఎంఎల్ (IUML) తదితర పార్టీలు టీవీకేకు మద్దతు ఇవ్వడంతో జోసెఫ్ విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఇదిలా ఉండగా రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకో నేతృత్వంలోని ఎండీఎంకే కూడా డీఎంకే కూటమికి గుడ్‌బై చెప్పి అధికార టీవీకేకు మద్దతు ప్రకటించింది. ఈ పరిణామంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయనే చర్చ మొదలైంది. స్టాలిన్ చేసిన తాజా వ్యాఖ్యలు, మారుతున్న రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.








