ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం మీడియా వర్గాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా జూలై 18న తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. “ఊరూ–వాడా” పేరుతో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు లేవని ప్రస్తుతానికి ఎన్టీఆర్ కార్యాలయం నుండి ప్రకటన వచ్చినా, అది వ్యూహాత్మకమే అనే ప్రచారం ఉంది. నేరుగా రాజకీయాల్లోకి రాకుండా తమిళనాడులో నటుడు విజయ్ అనుసరించిన తరహాలో ముందుగా అభిమానుల ద్వారా సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి, తరువాత రాజకీయ నిర్ణయం తీసుకునే వ్యూహంతో ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఆయన కొత్త పార్టీ స్థాపిస్తారా? లేక తన తాత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ బాధ్యతలను చేపట్టే ప్రయత్నం చేస్తారా? అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం కొత్త విషయం కాదు. 1999 ఎన్నికల సమయంలో ఆయన తండ్రి హరికృష్ణ, చంద్రబాబు నాయుడితో విభేదించిన నేపథ్యంలో “అన్న తెలుగుదేశం పార్టీ” తరఫున జూనియర్ ఎన్టీఆర్ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఎన్టీఆర్ చిత్రాలను పార్టీ కార్యాలయాల నుంచి తొలగించినవారే ఇప్పుడు ఆయన పేరుతో ఓట్లు అడుగుతున్నారని అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. అనంతరం సినిమా కెరీర్‌లో పూర్తిగా బిజీ అయిన ఆయన దాదాపు పదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
తర్వాత కుటుంబ విభేదాలు సద్దుమణిగిన అనంతరం తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పటికీ ఆసుపత్రి పడకపై నుంచే వీడియో సందేశాల ద్వారా ప్రచారం కొనసాగించడం అభిమానులను ఆకట్టుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాలవైపు చూడలేదు. అయితే ఆయన అభిమానులు మాత్రం నిరంతరం రాజకీయాల్లో చురుకుగా ఉండాలని కోరుకుంటూనే వచ్చారు.
టీడీపీలో చంద్రబాబు నాయుడు పూర్తి ఆధిపత్యం కొనసాగించడం, పార్టీ వారసుడిగా నారా లోకేష్‌ను ముందుకు తీసుకురావడం వల్లే జూనియర్ ఎన్టీఆర్‌కు అవకాశాలు దూరమయ్యాయని అభిమానులు వాదిస్తూ వచ్చారు. నిజమైన వారసత్వం నందమూరి కుటుంబానికేనని, అందులోనూ ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్‌కే అర్హత ఉందని వారు భావిస్తు వచ్చారు.
ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీ భవిష్యత్ నాయకత్వాన్ని నారా లోకేష్ చుట్టూనే నిర్మించేందుకు ప్రయత్నించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. 2011 మహానాడులో నందమూరి కుటుంబానికి సంబంధించిన ఫోటోలు లేకుండా కేవలం లోకేష్ ఫోటోలతో బ్యానర్లు ఏర్పాటు చేయడంపై హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
జూనియర్ ఎన్టీఆర్ వివాహ వేడుక సమయంలో కూడా హరికృష్ణ, చంద్రబాబు మధ్య దూరం కనిపించిందని ప్రధాన మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలన్నింటినీ చూపిస్తూ లోకేష్ ఎదుగుదలకు జూనియర్ అడ్డంకిగా మారతారనే భావనతో ఆయనను పార్టీకి దూరం పెట్టారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఈ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
2024 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని అభిమానులు ఆరోపించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఫ్లెక్సీలు తొలగించడం కూడా వివాదాస్పదమైంది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు సంబంధించినట్లు ప్రచారంలోకి వచ్చిన ఆడియో కాల్‌లో జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు వినిపించాయని ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటనపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో జూనియర్ అభిమానుల్లో అసంతృప్తి మరింత పెరిగిందనే చర్చ జరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా చురుకవుతున్నారనే ప్రచారం టీడీపీలో కొత్త చర్చకు దారి తీసింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జూనియర్ కొత్త పార్టీ పెట్టినా లేదా టీడీపీలోనే కీలక శక్తిగా ఎదిగినా, ప్రస్తుతం పార్టీలో ఉన్న పలువురు నాయకులు ఆయన వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
నారా లోకేష్ నాయకత్వంపై పార్టీలోని కొంతమంది సీనియర్లకు అసంతృప్తి ఉందనే ప్రచారం కూడా అప్పుడప్పుడు వినిపిస్తోంది. ఆయన రాజకీయ శైలి, “రెడ్ బుక్” వంటి అంశాలు కొందరిలో సందేహాలు పెంచాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఆ నాయకులకు పార్టీని విడిచి వెళ్లే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇప్పటివరకు టీడీపీలోనే కొనసాగుతున్నారని కూడా రాజకీయ చర్చల్లో వినిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీలో “నారా వర్సెస్ నందమూరి” అనే పరిస్థితి ఏర్పడే అవకాశముందని, నూతన పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీలో చీలిక అనివార్యం అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీలోని నాయకత్వ పోరు క్రమంగా బహిరంగ రూపం దాల్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ప్రచారం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉత్కంఠకు గురి చేసింది. ఆయన ఒక్క నిర్ణయం టీడీపీ భవిష్యత్ నాయకత్వ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి అడుగు వేస్తారో, అది టీడీపీ భవిష్యత్తును ఎంతవరకు ప్రభావితం చేస్తుందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.






