టీనేజర్ల భద్రతను (Teenagers Safety) దృష్టిలో పెట్టుకుని ఓపెన్‌ఏఐ (OpenAI) చాట్‌జీపీటీలో (ChatGPT) కీలక మార్పులు చేసింది. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రత్యేక భద్రతా నిబంధనలను (Special Safety Rules) అమలు చేస్తోంది. ఖాతా వివరాలు లేదా వినియోగ తీరును బట్టి ఎవరైనా మైనర్‌గా గుర్తించబడితే ఈ పరిమితులు స్వయంచాలకంగా అమల్లోకి వస్తాయి.
స్వీయహాని, హింస, తినే అలవాట్లకు సంబంధించిన మానసిక సమస్యలు, స్పష్టమైన లైంగిక అంశాలపై (Explicit Sexual Content) కఠినమైన నియంత్రణలు ఉంటాయి. ఎక్కువసేపు చాట్‌జీపీటీని ఉపయోగించకుండా విరామం తీసుకోవాలని సూచించే రిమైండర్లు(Reminders), రాత్రి వేళల్లో ప్రశాంత సమయాన్ని (Quiet Hours) పాటించే సదుపాయాలను కూడా అందిస్తున్నారు.
విద్యార్థుల (Students) కోసం ప్రత్యేక అధ్యయన విధానాన్ని (Study Mode) కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇవ్వకుండా, ఆలోచింపజేసే ప్రశ్నల ద్వారా విద్యార్థులు విషయాన్ని స్వయంగా అర్థం చేసుకునేలా చాట్‌జీపీటీ సహాయపడుతుంది.
టీనేజర్లు చాట్‌జీపీటీతో భావోద్వేగపరంగా అతిగా అనుబంధం ఏర్పరచుకోకుండా కొన్ని నియంత్రణలు విధించారు. చాట్‌జీపీటీకి వ్యక్తిగత భావాలు లేదా స్వీయచైతన్యం ఉన్నట్లు సూచించే విధంగా స్పందించకుండా పరిమితులు పెట్టారు. కొన్ని స్వర ఆధారిత సదుపాయాలను (Voice Features) కూడా టీనేజర్లకు అందుబాటులో లేకుండా చేశారు.
తల్లిదండ్రులు (Parents) తమ పిల్లల ఖాతాలను (Children’s Accounts) తమ ఖాతాలతో అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. స్వీయహాని లేదా ఆత్మహత్య (Suicide) వంటి తీవ్రమైన ప్రమాద అంశాలపై సంభాషణ జరిగినప్పుడు తల్లిదండ్రులకు హెచ్చరికలు పంపే విధానాన్ని ఓపెన్‌ఏఐ తీసుకొచ్చింది. పిల్లల గోప్యతను (Children’s Privacy) కాపాడేందుకు సంభాషణల్లోని అవసరమైన సమాచారాన్ని తొలగించే చర్యలు కూడా చేపడుతోంది.
చాట్‌జీపీటీ వినియోగంతో యువతకు ప్రమాదాలు ఎదురవుతున్నాయన్న విమర్శలు, న్యాయపరమైన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ భద్రతా చర్యలు తీసుకున్నారు. 16 ఏళ్ల ఆడమ్ రైన్ (Adam Raine) ఆత్మహత్యకు (Suicide) సంబంధించి అతని తల్లిదండ్రులు దాఖలు చేసిన కేసుతో పాటు, ఓపెన్‌ఏఐపై మరికొన్ని న్యాయపరమైన కేసులు కూడా నమోదయ్యాయి.
మరోవైపు పిల్లలు, టీనేజర్లు ఉపయోగించే కృత్రిమ మేధస్సు చాట్‌బాట్‌ల వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (U.S. Federal Trade Commission – FTC) దర్యాప్తు ప్రారంభించింది. చాట్‌బాట్‌ల వినియోగంలో పిల్లల భద్రతకు సంబంధించిన అంశాలపై నియంత్రణ సంస్థలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.








