తూర్పు ఆఫ్రికాలోని జిబూటీ తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 305 మంది వలసదారులతో యెమెన్‌కు వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడటంతో కనీసం 109 మంది మృతి చెందారు. మృతుల్లో 15 మంది చిన్నారులు ఉన్నట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) వెల్లడించింది. మరో 116 మంది గల్లంతయ్యారు.
ఐఓఎం వివరాల ప్రకారం.. గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 52 మంది పురుషులు, 42 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారు. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
‘హార్న్ ఆఫ్ ఆఫ్రికా’ ప్రాంతానికి చెందిన వేలాది మంది మెరుగైన జీవన పరిస్థితులు, ఆర్థిక అవకాశాల కోసం జిబూటీ మీదుగా బాబ్-అల్-మందెబ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. యెమెన్‌లో హింసాత్మక పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ వలస ప్రయాణాలు ఆగడం లేదని ఐఓఎం తెలిపింది.
ఈ ఘటనపై జిబూటీలో ఐఓఎం మిషన్ చీఫ్ అలెగ్జాండర్ కొయిసెక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మెరుగైన భవిష్యత్తు కోసం వలస వెళ్లేవారు ఎదుర్కొంటున్న ప్రమాదాలకు ఈ ఘటన నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రమాదం నుంచి బయటపడిన వారికి స్థానిక అధికారులు, ఐఓఎం బృందాలు వైద్య సహాయం అందిస్తున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మెరుగైన జీవితం కోసం ప్రమాదకర సముద్ర మార్గాలను ఎంచుకుంటున్న వలసదారులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.








