---Advertisement---

బెంగాల్ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..కాంగ్రెస్‌లో TMC విలీనం..?

June 10, 2026

---Advertisement---

దేశ రాజకీయాల్లో మరో సంచలన పరిణామానికి రంగం సిద్ధమవుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. విపక్షాల ఐక్యత కోసం ఏర్పాటు చేసిన ‘ఇండియా’(INDIA Alliance) కూటమి సమావేశం ఢిల్లీలో ముగిసిన వెంటనే పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాలపై నేషనల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) కాంగ్రెస్‌లో (Congress) విలీనం (Merger) దిశగా అడుగులు వేస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలవడంతో పార్టీ లోపల అసంతృప్తి బహిర్గతమైంది. ఇప్పటికే దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు మమతా నాయకత్వంపై తిరుగుబాటు స్వరం వినిపించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనగా.. తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌తో (Congress) చేతులు కలపడం తప్ప మమతకు మరో మార్గం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సోనియా నివాసంలో మమతా సుదీర్ఘ భేటీ..

టీఎంసీ(TMC) విలీన ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా మమతా బెనర్జీ మంగళవారం రాత్రి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమెతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవేళ విలీనం జరిగితే పార్టీతో పాటు అభిషేక్ రాజకీయ భవిష్యత్తుకు కూడా భద్రత లభిస్తుందని టీఎంసీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

3 దశాబ్దాల తర్వాత మళ్లీ సొంత గూటికి..?

1997లో కాంగ్రెస్ పార్టీని వీడిన మమతా బెనర్జీ.. 1998లో తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. అనంతరం కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకుని జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు మమత సిద్ధమవుతున్నారనే ప్రచారం జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే, ఈ విలీనాన్ని టీఎంసీ తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌లో విలీనానికి అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య రానున్న రోజుల్లో బెంగాల్ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment