---Advertisement---

ఏసీపీ ఇంట్లో అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలుడుతో బాల్కనీ గోడ కూలి ఒకరి మృతి

May 12, 2026

---Advertisement---

విజయవాడ (Vijayawada) నగరంలోని పటమటలంక (Patamata Lanka) ప్రాంతంలో ఉన్న ప్రత్యూష అపార్ట్మెంట్ (Pratyusha Apartment) లో సోమవారం తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏసీపీ సత్యానందం (ACP Satyanandam) నివాసంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏపీ కంప్రెషర్‌లో మంటలు చెలరేగి, ఆ మంటలు గ్యాస్ సిలిండర్‌కు వ్యాపించాయి. దీంతో భారీ శబ్దంతో సిలిండర్ పేలిపోయింది.

పేలుడు సంభవించే ముందు అపార్ట్మెంట్‌లోని పొరుగువారు పొగలు రావడం గమనించి వెంటనే ఇతర ఫ్లాట్లలో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. దీంతో నివాసితులంతా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్ది సేపటికే సిలిండర్‌తో పాటు ఏపీ కంప్రెషర్ కూడా పేలిపోవడంతో అపార్ట్మెంట్ మొత్తం కంపించింది. పేలుడు ధాటికి బాల్కనీ గోడలు, ఇనుప గ్రిల్స్ ఎగిరిపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు (Srinivasa Rao) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో ఏసీపీ సత్యానందం కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. మే 7వ తేదీన కుటుంబ సభ్యులంతా విదేశాలకు వెళ్లగా, 2 రోజుల క్రితమే సత్యానందం కూడా విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగిందన్న అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా గుంటూరు (Guntur) ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి జీజీహెచ్ (GGH) లో కూడా మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 24వ వార్డులో మంటలు చెలరేగి, అక్కడి వస్తువులు మరియు సీలింగ్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇటీవల ఆ వార్డులో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో రోగులను అక్కడికి తరలించలేదు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment