అమరావతి నగర నిర్మాణానికి (Amaravati Capital City Construction) భూసమీకరణలో (Land Pooling Scheme) భూములు ఇవ్వని రైతుల (Farmers) నుంచి భూసేకరణ ద్వారా భూములు తీసుకోవడానికి గుంటూరు జిల్లా యంత్రాంగం (Guntur District Administration) ప్రకటనలు విడుదల చేసింది. కొన్నాళ్లుగా భూసమీకరణలో సీఆర్డీఏకు (CRDA) భూములు ఇవ్వాలని రైతులతో చర్చలు జరుపుతూ, వారిని ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో భూసేకరణ దిశగా అడుగులు వేస్తోంది. రాజధాని ప్రాంతంలోని 22 గ్రామాల పరిధిలో 216.33 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది.
ప్రభుత్వం ప్రజాప్రయోజనాల కోసం అంటూ భూసేకరణ చేపట్టినప్పుడు, భూ యజమానులు (రైతులు) రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా కొన్ని కీలక హక్కులు కలిగి ఉంటారు. సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల ఇచ్చిన తీర్పుల ప్రకారం, ఏ భూమినైనా స్వాధీనం చేసుకునే ముందు ప్రభుత్వం తప్పనిసరిగా భూ యజమానికి ముందస్తు నోటీసు ఇవ్వాలి. భూసేకరణపై యజమాని లేవనెత్తే అభ్యంతరాలను వినాలి. ఆ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత కూడా భూమిని సేకరించాలని నిర్ణయిస్తే, ఆ విషయాన్ని యజమానికి తెలియజేయాలి.
స్వాధీనం చేసుకున్న భూమికి యజమానికి సముచితమైన, న్యాయబద్ధమైన పరిహారం చెల్లించాలి. పరిహారం తక్కువగా ఉంటే అది అధికార దుర్వినియోగం మరియు మోసం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భూమిని కోల్పోయిన వారికి ప్రభుత్వం సరైన పునరావాసం కూడా కల్పించాలి. పై సూత్రాలలో ఏదైనా పాటించకపోతే, భూ యజమానులు ఆ చర్యను కోర్టులో సవాలు చేసే హక్కు కలిగి ఉంటారు.
భూసేకరణలో ముఖ్యమైన అంశం పరిహారం. గ్రామీణ ప్రాంతాల్లో భూమే ప్రధాన జీవనాధారం కావడంతో, చట్టం ప్రకారం మార్కెట్ విలువకు దాదాపు నాలుగు రెట్లు వరకు పరిహారం పొందే అవకాశం ఉంది. గత మూడు సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో జరిగిన భూ విక్రయాల సగటు విలువ, స్టాంప్ డ్యూటీ విలువ లేదా భవిష్యత్తులో ఆ భూమికి ఉండే అభివృద్ధి సామర్థ్యం—వాటిలో ఏది ఎక్కువగా ఉంటే దానిని ప్రాతిపదికగా తీసుకుంటారు.
ఇదిలా ఉండగా, చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు ఇటీవల అమరావతి రాజధాని ఒక స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సుమారు 5 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం ఎకరం రూ. 10 కోట్లు విలువగా లెక్కిస్తే, మొత్తం విలువ రూ. 50 వేల కోట్లు అవుతుందని చెప్పారు. భవిష్యత్తులో ఎకరం రూ. 20 కోట్లకు చేరితే, ఆ భూముల విలువ లక్ష కోట్లకు పెరుగుతుందని వివరించారు.
ఇదే విషయాన్ని 2020లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఆయన ప్రస్తావించారు. అమరావతిలో ఎకరం భూమి విలువ సుమారు రూ. 10 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న పది వేల ఎకరాల భూముల విలువ లక్ష కోట్ల రూపాయలు అవుతుందని అన్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తే, భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ఎకరానికి రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎకరానికి రూ. 5 కోట్లు చొప్పున చెల్లించినా లక్షా యాభై వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం 22 గ్రామాల పరిధిలో 216.33 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తున్న సమయంలో, ఆయన చెప్పినట్టే రైతులకు మార్కెట్ విలువకు నాలుగు రెట్లు అంటే ఎకరానికి రూ. 40 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నలు ఆయా ప్రాంతాల్లో వినిపిస్తున్నాయి.
చట్టపరంగా గానీ, ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల పరంగా గానీ చూస్తే రైతులకు భారీ పరిహారం అందాల్సిందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా కాకుండా తక్కువ పరిహారం ఇవ్వాలని ప్రయత్నిస్తే అది రైతులను మోసం చేసినట్టే అవుతుంది. లేకపోతే అమరావతి భూముల విలువను అతిశయోక్తిగా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారనే భావన ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






