రాజధాని అమరావతి (Amaravati) భూ సమీకరణలో (Land Pooling) రైతులకు (Farmers) ఇచ్చిన హామీలు(Promises), వాస్తవ పరిస్థితుల మధ్య భారీ వ్యత్యాసం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం… అమలులో మాత్రం ప్రభుత్వ పెద్దలు లాభపడుతూ రైతులకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. 2025 డిసెంబర్ 26న మందడంలో జరిగిన సంఘటనలో దొండపాటి రామారావు(Dondapati Ramarao) అనే రైతు తనకు ఇచ్చిన ప్లాట్‌పై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రాణాలు కోల్పోవడం ఈ పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.
రాజధాని ప్రాంతం వెలగపూడిలో కంచెర్ల సాంబశివరావు(Kancherla Sambasiva Rao), కంచెర్ల శాంతికిరణ్(Kancherla Shanti Kiran), కంచెర్ల ఓంకార్‌కు(Kancherla Omkar) చెందిన మొత్తం 29.52 ఎకరాలను భూ సమీకరణ కింద సీఆర్‌డీఏకు(CRDA) ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెలగపూడిలో 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) కంచెర్ల సాంబశివరావు, కంచెర్ల శాంతికిరణ్, కంచెర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీలకు సీఆర్‌డీఏ రిటర్నబుల్ ప్లాట్ల కింద ఇచ్చింది. అయితే ఇప్పుడు అవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కుటుంబానికి చెందిన ట్రస్ట్ ద్వారా కొనుగోలు కావడం వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి (Nara Brahmani) ట్రస్టీగా ఉన్న నివాస ట్రస్ట్ పేరుపై రూ.18.75 కోట్లకు 2025 ఏప్రిల్ 2న కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోలు, వాటి హద్దులు, ముఖ్యంగా రెసిడెన్షియల్ జోన్‌ను గ్రీన్ జోన్‌గా (Green Zone) బ్రాహ్మణి కొనుగోలు అనంతరం మార్చడం వంటి అంశాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పలువురు చెబుతున్నారు.

అయితే సీఎం చంద్రబాబు కుటుంబం 5.17 ఎకరాలలో నిర్మించుకుంటున్న భారీ నివాసానికి పక్కనే ఇప్పుడు ఈ గ్రీన్ జోన్ మార్పుల వల్ల రైతులకు రావాల్సిన ప్లాట్లు తగ్గిపోయాయని, సుమారు వేల గజాల నివాస స్థలం కోల్పోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గజం ధర రూ.50 వేలు అని సీఆర్‌డీఏ చెప్పింది. అయితే అదే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు కుటుంబమే గజం రూ.7,500కు భూములు కొనుగోలు చేయడం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ధరల వ్యత్యాసం వెనుక అసలు లెక్కలు ఏమిటి? నిజమైన విలువ ఎంత? అనే ప్రశ్నలు మేధావులు లేవనెత్తుతున్నారు.
ఇక శ్మశానం భూమిని కూడా ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై చూపించి ల్యాండ్ పూలింగ్‌లో చేర్చినట్లు ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. 2015 జనవరి 3న సీఆర్‌డీఏ జారీ చేసిన నోటిఫికేషన్‌లో 163–బీ సర్వే నంబరులో ఒక ఎకరం శ్మశానంగా స్పష్టం చేసింది. కానీ ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూమిని సమీకరిస్తూ జారీ చేసిన 9.22 ఫార్మ్‌లో మాత్రం ఆ భూమి కంచెర్ల శాంతికిరణ్‌దిగా పేర్కొనడం జరిగిందని ఆరోపిస్తున్నారు. శ్మశానం ఉన్న ఎకరం భూమిని కంచెర్ల శాంతికిరణ్‌దిగా చూపుతూ, దానికి కేటాయించిన వెయ్యి గజాల రెసిడెన్షియల్ స్థలంతో పాటు 25 వేల గజాలను కంచెర్ల శాంతికిరణ్ కుటుంబ సభ్యుల నుంచి సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కొనుగోలు చేయడం ద్వారా ఆ భూములు టీడీపీ అధినేత కుటుంబం చేతిలోకి మారడం రైతుల్లో అనుమానాలను పెంచుతోందని అంటున్నారు.
మొత్తంగా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు భారీగా నిర్మించుకుంటున్న నూతన గృహానికి సంబంధించిన స్థలంపై, దాని పక్కనే గ్రీన్ జోన్‌గా మార్చి అక్కడ ఎవరు నివాసం ఉండేందుకు వీలు లేకుండా చేయడం పై అనేక అనుమానాలు ప్రజల్లో, ముఖ్యంగా సరైన ప్లాట్లు అందక నష్టపోతున్న రాజధాని రైతుల్లో కలుగుతున్నట్లు కనిపిస్తోంది.
అలాగే రాజధాని నిర్మాణం కోసం భారీగా అప్పులు తీసుకున్న ప్రభుత్వం, ఈ లెక్కన అప్పులను భూముల విక్రయాల ద్వారా తీర్చలేదని, ఈ రాజధాని అప్పులు చివరికి ప్రజల పన్నుల భారంగా మారే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నిజంగా స్వయం సమృద్ధి రాజధానిగా మారుతుందా? లేక రైతుల త్యాగాలపై నిర్మితమైన భారంగా మిగిలిపోతుందా? అనే సందేహాలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామాలు మొత్తం చూస్తే రాజధాని అభివృద్ధి పేరుతో జరుగుతున్న నిర్ణయాలు పారదర్శకంగా లేవని, కొందరికి లాభం చేకూర్చేలా మారుతున్నాయని, రాజధాని రైతుల్లోనే చర్చలు ఊపందుకున్నాయని చెబుతున్నారు.






