---Advertisement---

రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌? ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు విమర్శ.

October 11, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదన్న నిర్ణయం రాజకీయంగా వివాదాస్పదంగా మారుతోంది. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గతంలో ఉన్న 29 గ్రామాలతో పాటు, ఇటీవల రెండో దశ భూసమీకరణ చేపట్టిన పంచాయతీల్లోనూ ఎన్నికలు నిర్వహించడం లేదని మంత్రి నారాయణ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. పెదకూరపాడు, తాడికొండ, అమరావతి, మేడికొండూరు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని తెలిపాయి.

ఈ నిర్ణయంపై పలు వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగు వేయడానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నాయి. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రైతుల నుంచి భూములు సేకరించి, వారికి న్యాయంగా ప్లాట్లు కేటాయించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతులకు కేటాయించాల్సిన ప్లాట్ల విషయంలోనూ, స్థానిక భూముల వినియోగంలోనూ అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తమ తీర్పు ద్వారా ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉందని, అమరావతి భూసమీకరణకు సంబంధించిన వివాదాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఒకవైపు అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటిస్తుండగా, మరోవైపు రాజధాని పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూసమీకరణ చేపట్టిన, భవిష్యత్తులో చేపట్టనున్న గ్రామాల్లో ప్రజలకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించకుండా వారి ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

రాజధాని నిర్మాణంపై, అక్కడి రైతుల మద్దతుపై ప్రభుత్వానికి అంతటి నమ్మకం ఉంటే, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నిస్తున్నాయి. అమరావతి అభివృద్ధి, భూసమీకరణపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఎన్నికలే సరైన వేదిక కాదా? అన్న చర్చకు ఈ పరిణామం తెరలేపింది. ఈ విమర్శలపై తెలుగుదేశం–జనసేన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment