---Advertisement---

సంక్షేమానికి నిధుల కొరత.. ప్రచారానికి కోట్ల వర్షం: తాజాగా ‘పాడ్‌కాస్ట్’ ప్రచారానికి సర్కార్ టెండర్లు ?

October 11, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఉందంటున్న కూటమి ప్రభుత్వం, ప్రచార కార్యక్రమాల కోసం మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే డిజిటల్ ప్రచారం, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, జాతీయ మీడియా కార్యక్రమాల స్పాన్సర్‌షిప్‌ల కోసం భారీగా ప్రజాధనం వెచ్చిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో, తాజాగా ప్రభుత్వ పాడ్‌కాస్ట్ సిరీస్‌ తయారీ, ప్రచురణ కోసం టెండర్లు ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సమాచార, పౌర సంబంధాల శాఖ విడుదల చేసిన 2026 అక్టోబర్ 11 నాటి టెండర్ నోటిఫికేషన్ ప్రకారం, ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో పాడ్‌కాస్ట్ సిరీస్‌ను రూపొందించేందుకు అర్హత కలిగిన ఏజెన్సీల నుంచి బిడ్లు ఆహ్వానించారు. ఇప్పటికే వివిధ ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్న తరుణంలో ఈ కొత్త ప్రయత్నం ప్రభుత్వ ఖజానాపై మరింత భారం మోపుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చెల్లింపు వంటి ఎన్నికల హామీల అమలు, విద్యాదీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులు, ఉద్యోగుల డీఏ, పీఆర్‌సీ బకాయిల పరిష్కారం వంటి అంశాలపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తూ, ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ప్రభుత్వ డిజిటల్ ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం కింద 10 వేల నుంచి లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లను ఎంప్యానల్ చేసి, ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు నెలకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు చెల్లించేలా నిబంధనలు రూపొందించినట్లు సమాచారం. డిజిటల్ ప్రచారం కోసం రూ.40 కోట్ల పరిపాలనా అనుమతులు, డిజిటల్ కార్పొరేషన్‌లో సోషల్ మీడియా సిబ్బంది నియామకాలు, మంత్రుల కార్యాలయాల్లో సోషల్ మీడియా పోస్టుల భర్తీ వంటి అంశాలు కూడా వివాదానికి కారణమయ్యాయి. గత రెండేళ్లలో సోషల్ మీడియా బృందాల కోసం రూ.160 కోట్లకు పైగా ఖర్చు చేశారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

జాతీయ మీడియా కార్యక్రమాల స్పాన్సర్‌షిప్‌ల విషయంలోనూ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. న్యూఢిల్లీలో రిపబ్లిక్ టీవీ నిర్వహించిన వార్షిక సమ్మిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ స్పాన్సర్‌గా వ్యవహరించి రూ.43,83,583 విడుదల చేసినట్లు పేర్కొనగా, కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌కు కూడా స్టేట్ స్పాన్సర్ పార్ట్‌నర్‌గా వ్యవహరించింది. ఈ ఖర్చులు ప్రజా ప్రయోజనాల కోసమా, లేక పాలకుల రాజకీయ ప్రచారం, వ్యక్తిగత ఇమేజ్ పెంపు కోసమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదే సమయంలో గతంలో కోవిడ్, వరదల వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించిన 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను పక్కనపెట్టడంపై వారి కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు సేవలందించిన వలంటీర్లకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రచార కార్యక్రమాల కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా బృందాలపై కోట్ల రూపాయలు ఖర్చు చేయడమేంటని మాజీ వలంటీర్లు, ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య కొత్త పాడ్‌కాస్ట్ ప్రచారానికి ఎంత ఖర్చవుతుంది? ఈ వ్యయం ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment