ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వ్యవహారశైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, సాయికృష్ణ కేసు (Sai Krishna Case) నుంచి సుగాలీ ప్రీతి (Sugali Preethi) ఘటన వరకు ప్రతి అంశంలోనూ పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను, బాధితులను తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం ఒకవైపు సాయికృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించి న్యాయం చేస్తామని చెబుతుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం సాయికృష్ణను నేరస్థుడిగా చిత్రీకరించేలా మాట్లాడుతున్నారని అంబటి విమర్శించారు. అదే సమయంలో జనసేన (Jana Sena Party) నేత సామినేని ఉదయభాను (Samineni Uday Bhanu) సాయికృష్ణ తల్లిని పరామర్శించి, పవన్ కళ్యాణ్ పంపించడంతోనే వచ్చామని చెప్పడం చూస్తుంటే అసలు పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలను తాటతీస్తామంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి తగవని అన్నారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష ఉపయోగించడం సరైన పద్ధతి కాదని అంబటి పేర్కొన్నారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ (Pantham Nanaji) మాట్లాడుతున్న తీరు కూడా ప్రజలు గమనించాలని సూచించారు. “గూండాలు ఎవరో ప్రజలకు తెలుసు. పవన్ గారూ… మీరు ఏడు జన్మలెత్తినా మమ్మల్ని ఏమీ చేయలేరు. మీ బెదిరింపులకు, మాటలకు వైసీపీ నాయకులు భయపడరు” అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.
“నేను హోంమంత్రిగా లేకపోవడం మీ అదృష్టం” అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా అంబటి స్పందించారు. ఆ మాటలతో ప్రస్తుతం ఉన్న హోంమంత్రి సమర్థంగా పనిచేయడం లేదని పవన్ స్వయంగా అంగీకరించినట్టేనని వ్యంగ్యంగా అన్నారు. నిజంగానే అంత ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్‌కు హోంమంత్రి పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును తాను కోరుతున్నానని పేర్కొన్నారు.
చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదని అంబటి స్పష్టం చేశారు. ముంబై ఉగ్రదాడుల (Mumbai Terror Attacks) నిందితుడు కసబ్‌కు (Ajmal Kasab) కూడా చట్ట ప్రకారమే శిక్ష అమలైందని గుర్తుచేశారు. సాయికృష్ణ కేసులో ఇప్పటికే ఒక అధికారి విచారణ కొనసాగిస్తుండగా, అకస్మాత్తుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(SIT) ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని ఎదుర్కోలేక ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. ఈ కేసులో అసలు నిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ(CBI) లేదా ఎన్ఐఏతో(NIA) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కోనసీమలో కాపు (Kapu) నేతల సమావేశంపై కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అంబటి తప్పుబట్టారు. గతంలో కులాల అంశంపై పవన్ చేసిన వ్యాఖ్యల మాదిరిగా ఈ రాష్ట్రంలో మరెవ్వరూ మాట్లాడలేదని అన్నారు. ఒకవైపు సాయికృష్ణ ఇంటికి జనసేన నాయకులను పంపిస్తూ, మరోవైపు అదే కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును(CI Nagaraju) అరెస్ట్ చేయవద్దంటూ ఆందోళనలు చేయించడం పవన్ రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.






