ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంపద సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజా ఆస్తులు, సంక్షేమ రంగాలను వరుసగా ప్రైవేటు సంస్థలకు అప్పగించే దిశగా అడుగులు వేస్తోందనే విమర్శలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్లు, ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ వైద్య కళాశాలలు, పర్యాటక కేంద్రాలు, పోర్టు భూములు, విమానాశ్రయాలు వంటి వ్యూహాత్మక రంగాలపై ప్రైవేటీకరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర రహదారులను పీపీపీ విధానంలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ ఆలోచన మొదటి నుంచే తీవ్ర విమర్శలకు దారితీసింది. సుమారు 10,200 కిలోమీటర్ల రహదారులను ప్రైవేటు సంస్థల నిర్వహణకు అప్పగించి టోల్ వ్యవస్థను విస్తరించాలన్న ప్రతిపాదనలు బయటకు రావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా నగరాల లోపలి రోడ్లపై కూడా టోల్ విధించే అవకాశాలు ఉన్నాయనే చర్చ మధ్యతరగతి, చిన్న వ్యాపారులు, సాధారణ వాహనదారుల్లో భయాందోళనలు పెంచుతోంది. ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై ఇది మరో అదనపు భారం అవుతుందని విమర్శకులు చెబుతున్నారు.
ఆరోగ్య రంగంలో కూడా ప్రభుత్వ విధానాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు రావడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో కొత్తగా నిర్మించిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడల్‌లో ప్రవేట్ వ్యక్తుల ద్వారా నిర్వహించాలన్న ప్రతిపాదనలు రావడం, భవిష్యత్తులో వైద్య విద్య మరింత ఖరీదైనదిగా మారే ప్రమాదాన్ని సూచిస్తోందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ వైద్య సేవలు క్రమంగా కార్పొరేట్ ఆధీనంలోకి వెళ్తే పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండకపోవచ్చని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విశాఖలోని గోల్డెన్ జూబ్లీ పోర్టు ఆసుపత్రి ప్రైవేటీకరణ ప్రతిపాదనలు కూడా కార్మిక సంఘాల నిరసనలకు కారణమయ్యాయి. ఉద్యోగుల సంక్షేమం కోసం నిర్మించబడిన ఆసుపత్రులను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే సాధారణ ఉద్యోగులు, కార్మికులకు వైద్య భద్రత దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఆర్టీసీ పరిస్థితి మరింత చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ ఖర్చులను కారణంగా చూపుతూ సంస్థను పరోక్షంగా ప్రైవేటీకరణ వైపు నడిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా “వడోదర మోడల్” పేరుతో కీలక బస్ స్టేషన్లు, వాటికి అనుబంధంగా ఉన్న విలువైన భూములను ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇవ్వాలన్న ఆలోచన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోలు, వాణిజ్య విలువ కలిగిన భూములు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తే భవిష్యత్తులో ప్రభుత్వ రవాణా వ్యవస్థ పూర్తిగా బలహీనపడే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమ, పోర్టు భూముల అంశం కూడా ఇప్పుడు రాజకీయంగా సున్నితంగా మారింది. ఉక్కు పరిశ్రమలో అధికారులను డెప్యుటేషన్‌పై పంపడం ద్వారా సంస్థను క్రమంగా బలహీనపరుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు విశాఖ పోర్టుకు చెందిన వేల ఎకరాల భూములను తక్కువ ధరలకు లీజుకు ఇవ్వాలన్న ప్రయత్నాలు ప్రజా ఆస్తుల పరిరక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. క్రీడా మైదానాలు, ప్రజా ఉపయోగ భూములు కూడా వాణిజ్య ప్రయోజనాల కోసం కార్పొరేట్ సంస్థలకు అందజేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి.
పర్యాటక రంగంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు. భవానీ ద్వీపం, సూర్యలంక బీచ్ రిసార్ట్ వంటి లాభదాయకమైన ప్రభుత్వ యూనిట్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న ప్రతిపాదనలు బయటకు రావడం అనేక అనుమానాలకు దారితీసింది. ప్రభుత్వానికి నిరంతర ఆదాయం అందిస్తున్న ఆస్తులను తక్కువ మొత్తాలకు లీజుకు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇక విమానాశ్రయాల మానిటైజేషన్ అంశం కూడా గతంలో పెద్ద చర్చగా మారింది. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి వంటి కీలక విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ప్రయాణికులపై అదనపు ఫీజులు, సేవల ఖర్చులు పెరిగే అవకాశం ఉందని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. ఒకసారి ప్రైవేటు ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ప్రభుత్వ నియంత్రణ తగ్గిపోవడం వల్ల ప్రజా ప్రయోజనాల కంటే లాభాలకే ప్రాధాన్యం పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ రంగాన్ని బలపరచకుండా, ప్రజా ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా భవిష్యత్తులో విద్య, వైద్యం, రవాణా వంటి ప్రాథమిక హక్కులు కూడా సామాన్య ప్రజలకు ఖరీదైన సేవలుగా మారే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ప్రజల పన్నులతో నిర్మించబడిన ప్రభుత్వ ఆస్తులు చివరికి కొద్ది కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతే, దీర్ఘకాలంలో సామాన్య ప్రజల ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక భద్రత, సంక్షేమ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని సామాజిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. అభివృద్ది ముసుగులో ప్రభుత్వ ఆస్తుల విద్వంశంగా వారు అభిప్రాయపడుతున్నారు.






