ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు, పరిపాలన, అవినీతి అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఆ దిశగా కాకుండా వివిధ మాఫియా వ్యవస్థలకు అవకాశం కల్పించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా మద్యం, ఇసుక, గ్రావెల్, గంజాయి, డ్రగ్స్, భూకబ్జాలు, పర్యావరణ విధ్వంసం వంటి అంశాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయని పేర్కొంటున్నారు.
ఈ విమర్శలకు బలం చేకూర్చేలా కూటమికి చెందిన నేతలే పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోందని బహిరంగంగా వ్యాఖ్యానించగా, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ ఎంపీ చిన్నీ గంజాయి వ్యవహారాల్లో ఉన్నారని ఆరోపించారు. మరోవైపు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఘటన కూడా పెద్ద చర్చగా మారింది.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని టీడీపీ నాయకుడు శావల దేవదత్ సవాల్ విసరడం, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన రేప్ ఆరోపణలు, అనంతపురంలో పేకాట క్లబ్బుల వ్యవహారంపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా మారాయని విశ్లేషకులు అంటున్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేరు ఈ-స్టాంపుల కుంభకోణంలో వినిపించడం, 99 పైసలకు భూముల కేటాయింపుల వెనుక పెద్ద మాఫియా ఉందని మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించడం మరింత సంచలనంగా మారింది.
విశాఖలో కొండల తవ్వకాల ద్వారా పర్యావరణ విధ్వంసం జరుగుతోందని మాజీ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించగా, అమరావతి భూసమీకరణ వ్యవహారంలో వృద్ధురాలిని అన్యాయంగా రోడ్డున పడేశారని టీడీపీ అనుకూల జర్నలిస్ట్ రమేష్ కందుల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలన్నీ కూటమికి అనుకూలంగా భావించే వర్గాల నుంచే రావడం గమనార్హమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ప్రతిపక్షాలపై నిరంతరం దాడులు చేస్తూ, “డైవర్షన్ పాలిటిక్స్” ద్వారా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా మద్దతు తమకు రక్షణగా ఉందనే ధీమాతోనే కూటమి నేతలు మాఫియా స్థాయిలో నిర్భయంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.






