ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (State Financial Situation) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు జగన్ (YS Jagan) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ (CAG) రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర స్థూల ఆర్థిక వృద్ధిరేటు జీఎస్డీపీ (GSDP) 10.75 శాతంగా ఉందని ప్రచారం చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వ స్వంత పన్ను ఆదాయాలు 3.22 శాతం క్షీణించడం తీవ్ర విరుద్ధతగా ఆయన అభివర్ణించారు.
సాధారణంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు, వినియోగం పెరగడంతో ప్రభుత్వ పన్ను ఆదాయాలు కూడా గణనీయంగా పెరుగుతాయని జగన్ పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అన్నారు. 2025-26 బడ్జెట్‌లో (Budget) ప్రభుత్వం స్వంత పన్ను ఆదాయాలు (Own Tax Revenues) 9.60 శాతం పెరుగుతాయని అంచనా వేసినా, వాస్తవానికి 3.22 శాతం తగ్గిపోయాయని ఆయన విమర్శించారు.
2023-24లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ (YSRCP Government) చివరి ఏడాదిలో రాష్ట్ర పన్ను ఆదాయాలు రూ. 85,922.23 కోట్లుగా ఉన్నాయని గుర్తు చేశారు. రెండు సంవత్సరాల వ్యవధిలో కనీసం 8 శాతం వృద్ధి నమోదై ఉంటే 2025-26 నాటికి ఈ ఆదాయం రూ. 1,00,219.69 కోట్లకు చేరాల్సి ఉండేదని తెలిపారు. కానీ వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ. 86,552.68 కోట్లే కావడంతో, రాష్ట్రానికి సుమారు రూ. 13,667 కోట్ల నష్టం జరిగిందని జగన్ ఆరోపించారు.
“సంపద సృష్టి”(Wealth Creation) పేరుతో ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవంగా ఆదాయాలు తగ్గడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇదేనా సంపద సృష్టి అంటూ ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో విఫలమైందని విమర్శించారు.
అలాగే, 2025 మేలో ఏపీఎండీసీ (APMDC) ద్వారా సమీకరించిన రూ. 9,000 కోట్ల ఎన్‌సీడీ (NCD) నిధుల వినియోగంపై కూడా జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిధులను ఆస్తుల సృష్టికి కాకుండా ప్రభుత్వ రెవెన్యూ వ్యయాలకు వినియోగించారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రైవేట్ ఎన్‌సీడీ హోల్డర్లకు (NCD Holders) రాష్ట్ర సమగ్ర నిధికి (కన్సాలిడేట్ ఫండ్) యాక్సిస్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
గత రెండు సంవత్సరాలుగా విధానాల స్థబ్దత, అవినీతి, రాజ్యాంగ విరుద్ధమైన రుణ సేకరణ విధానాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాయని జగన్ ఆరోపించారు. వేగవంతమైన అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, కానీ ఖాతాల లెక్కలు మాత్రం వాస్తవ పరిస్థితిని బహిర్గతం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.






