ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంధన ధరలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తూ, ప్రజలపై “బాదుడే బాదుడు” మోపుతున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అంశంపై విమర్శల పాలవుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో “మేము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తాం”, “పన్నులు తగ్గిస్తాం” అంటూ ఇచ్చిన హామీలు ఎక్కడా అంటూ ప్రజల నిలదీస్తున్నారు..
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తరచూ విమర్శించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పెట్రోల్ బంకుల వద్ద ధరలపై చేసిన నిరసనలు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మేనిఫెస్టోలో కూడా ఇంధన ధరల నియంత్రణపై స్పష్టమైన హామీలు ఇచ్చిన కూటమి నేతలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలుపై ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు.
అయితే ఇంధన ధరల అసలు చరిత్రను పరిశీలిస్తే, రాజకీయ ఆరోపణల కంటే వాస్తవాలు వేరేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి అమరావతిలో పెట్రోల్ ధర సుమారు రూ.69.60 ఉండగా, 2019లో ఆయన పదవి వీడే సమయానికి అదే ధర రూ.86.71కు చేరింది. అంటే ఆయన ఐదేళ్ల పాలనలోనే పెట్రోల్ ధర దాదాపు రూ.17 పెరిగింది. ఈ లెక్కలను అసెంబ్లీలో అప్పట్లో అధికారికంగానే ప్రస్తావించిన విషయం గుర్తు చేస్తున్నారు.
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 సెప్టెంబర్‌లో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.1 చొప్పున రోడ్ డెవలప్‌మెంట్ సెస్సు విధించింది. దీంతో పెట్రోల్ ధర రూ.86.71 నుండి రూ.87.71కి పెరిగింది. అయితే గత టీడీపీ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధి పేరుతో తీసుకున్న రుణాలు, వాటి వడ్డీ భారం కారణంగానే స్వల్పంగా ఈ రూ.1 సెస్సు విధించాల్సి వచ్చిందని నాడే ప్రజలకి వివరించారు. (నిజానికి ఈ రూ.1 పెద్ద భారం కూడా కాదు) ముఖ్యంగా 2017-18లో రోడ్ల పునరుద్ధరణ కోసం టీడీపీ తీసుకున్న 3 వేల కోట్ల రుణాలను ఎన్నికల ప్రయోజనాల కోసం పసుపూ కుంకుమ లాంటి ఇతర పథకాలకూ మళ్లించారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. దీంతో వాటిపై వడ్డీలు కట్టే భారం వైసీపీ ప్రభుత్వంపై పడిన విషయం గుర్తు చేస్తున్నారు.
ఇక 2020 తర్వాత కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన సమయంలో, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను భారీగా పెంచింది. పెట్రోల్‌పై కేంద్ర పన్నులు రూ.20 పరిధి నుండి రూ.33 వరకు పెరగడంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా 2021 మే నెలలో పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం 18 సార్లు పెంచింది. ఆ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెట్రోల్ ధరలు రూ.87 నుండి రూ.111 దాటాయి. తర్వాత దీపావళి సందర్భంగా కేంద్రం రూ.5 తగ్గించినా, సాధారణ ప్రజలపై పడిన భారంలో పెద్దగా ఉపశమనం రాలేదని విమర్శలు వచ్చాయి.
ఈ సమయంలో తెలుగుదేశం, జనసేన నేతలు మాత్రం కేంద్రంతో వైసీపీ పోత్తులో ల్లేకపోయినా “జగన్ ప్రభుత్వం కారణంగానే ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి” అంటూ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు అదే బీజేపీతో కూటమిగా అధికారంలో ఉన్న ఈ నేతలు, కేంద్రం ఇంధన భాదుడు నిర్ణయాలపై మౌనం పాటించడం రాజకీయ ద్వంద్వ వైఖరిగా విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.3.30, డీజిల్‌పై రూ.3.14 మేర భారాన్ని పెంచిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధరలు రూ.113 దాటగా, డీజిల్ రూ.101కు చేరినట్టు సమాచారం. దీంతో “ఇది కూడా గత ప్రభుత్వంపైనే నెట్టేస్తారా?” అని కూటమి నేతలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున మాట్లాడిన నేతలు, నేడు అధికారంలోకి వచ్చాక అదే ప్రజల బాధలను ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్న తీవ్రంగా వినిపిస్తోంది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోకపోవడం, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. రవాణా వ్యయాలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. రైతాంగంపై డీజిల్ ధరల ప్రభావం తీవ్రంగా పడుతుంది. వ్యవసాయ యంత్రాలు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం అధికమవుతుంది. చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగం ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ధరల పెరుగుదల మరింత భారం అవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని. రాష్ట్ర పన్నులను తగ్గించి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, దేశంలోనే తక్కువ ఇంధన ధరలు కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే నాడు చేసిన విమర్శలు, ఇచ్చిన హామీలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా అన్న ప్రశ్న మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.






