ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఐఆర్ వంటి అంశాలపై ప్రశ్నించినందుకు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని విధుల నుంచి తొలగించడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇది ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి పెంచే చర్యగా భావిస్తున్నారు. ముఖ్యంగా కాకర్ల వెంకట్రామిరెడ్డి తాను వైసీపీ తరుపున 2024లో ప్రచారం చేసినట్టు సాక్ష్యాలు చూపించాలని సవాల్ చేస్తున్నా ప్రభుత్వం నుండి స్పందన లేకపోగా అదే కారణంతో విధుల నుండి డిస్మిస్ చేయడం దారుణం అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇదే చంద్రబాబు గారి పాలనలో నాటి ఏపీ ఎంజీవో అధ్యక్షుడు అశోక్ బాబు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ 2018 ఎన్నికల వేల కర్నాటకా రాష్ట్రం వెళ్ళి బహిరంగ వేదికపై బీజేపీని ఓడించాలని చేసిన ప్రచారం విషయంలో అప్పుడే చంద్రబాబు గారికి పలువురు ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్య అశోక్ బాబుపై తీసుకోలేదని పైగా అతనికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి సత్కరించారని గుర్తు చేస్తున్నారు. ఈ ద్వంద వైఖిరితోనే ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష సాదింపు దోరణి ప్రదర్శిస్తునట్టు కనిపిస్తుందని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు “ఎక్కువ మంది పిల్లలను కనాలి” అన్న వ్యాఖ్యపై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించిన మార్కాపురం జిల్లా కనిగిరి మండలం తాళ్లూరు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దద్దాల శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై కేసు నమోదు చేయడం కూడా విమర్శలకు గురైంది. మైలవరం తారకరామా నగర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన ఘటనలో కుట్ర ఉందని ఆరోపిస్తూ హెడ్‌మాస్టర్ జాన్‌ను సస్పెండ్ చేయడం ప్రభుత్వం వైఖరిపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
అమరావతి రాజధాని నిర్మాణంపై సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేసినందుకు వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిద్ధార్థి సుభాష్ చంద్రబాస్‌పై సస్పెన్షన్ విధించడం కూడా చర్చనీయాంశమైంది. ఇది వ్యక్తిగత అభిప్రాయాల స్వేచ్ఛపై దాడిగా విమర్శిస్తున్నారు. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని శంకరయ్య పేర్కొనడంతో, అతనిని ఉద్యోగం నుంచి తొలగించడం మరింత వివాదానికి దారి తీసింది. అదే విధంగా, అదనపు పనిభారం, తగిన వేతనాల లేమిపై ఆవేదన వ్యక్తం చేసిన గ్రామ సచివాలయ సర్వేయర్లు జి. లక్ష్మీప్రసాద్, జి. శరత్‌లను సస్పెండ్ చేయడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతోంది.
మొత్తంగా, ప్రభుత్వం మారిన తర్వాత ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చర్యలు నిజంగా క్రమశిక్షణ కోసం తీసుకున్నవేనా? లేక విమర్శలను అణచివేయడానికి చేస్తున్నాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.








