ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు (High Court) చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. పిల్లలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి అని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ తెలియకపోతే విద్యార్థులు అనేక అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంగ్లిష్ అనేది దేశవ్యాప్తంగా ప్రజలను కలిపే సాధనమని పేర్కొంటూ, తెలుగుతో పాటు ఇంగ్లిష్‌లో కూడా విద్య అందించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు మరింత విస్తృత అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడింది.
ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) ద్విభాషా విధానం అమలు చేయడం ద్వారా పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని కోర్టు సానుకూలంగా చూసింది. ఇదే సమయంలో గతంలో జగన్ ప్రభుత్వం (Jagan Government) తీసుకొచ్చిన ఇంగ్లిష్ మీడియం విధానంపై తీవ్ర విమర్శలు చేసిన ప్రతిపక్షాల వైఖరి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం (English Medium) ప్రవేశపెట్టాలని నిర్ణయించగా, అప్పటి ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన(Jana Sena), బీజేపీ(BJP) తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కొందరు నాయకులు ఈ నిర్ణయాన్ని రాష్ట్ర సంస్కృతి, భాషకు ముప్పుగా కూడా చిత్రీకరించారు. అయితే ఇప్పుడు అదే రాజకీయ పక్షాల ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధనకు సంబంధించి ద్విభాషా విధానం (తెలుగు, ఇంగ్లిష్) ప్రొసీడింగ్స్ జారీ కావడం గమనార్హంగా మారింది.
ఇంగ్లిష్ పరిజ్ఞానం లేక మెరిట్ ఉన్న విద్యార్థులు కూడా ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (N. R. Narayana Murthy) గతంలోనే పేర్కొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ కూడా చిన్న వయసులోనే పిల్లలు బహుభాషా పరిజ్ఞానం పొందడం వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం గ్లోబలైజేషన్ కాలంలో పేద పిల్లలు కూడా ప్రపంచ స్థాయి అవకాశాలకు పోటీ పడాలంటే ఇంగ్లిష్ అవసరమని భావించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది.
అంతేకాకుండా తెలుగు భాషను పూర్తిగా పక్కన పెట్టకుండా, తెలుగుమీడియం కొనసాగించాలనుకునే విద్యార్థుల కోసం కొన్ని పాఠశాలలను కొనసాగించింది. ఇంగ్లిష్ మీడియంకు మారే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ చర్యలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవేనని అప్పట్లో విద్యావేత్తలలో కొందరు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు హైకోర్టు కూడా ఇంగ్లిష్ విద్య అవసరాన్ని స్పష్టంగా గుర్తించడంతో, జగన్ ప్రభుత్వం అప్పట్లో తీసుకున్న నిర్ణయంపై మళ్లీ చర్చ మొదలైంది. నాడు రాజకీయ విమర్శలకు గురైన ఆ నిర్ణయం, ఇప్పుడు సమాజ అవసరాలకు అనుగుణమైనదేనా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ వినిపిస్తోంది.






