ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చిన ఈ భారీ మద్యం కుంభకోణంపై ఈడీ అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని భార్య కేశినేని జానకి లక్ష్మికి మరోసారి సమన్లు జారీ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈనెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయం (ED Headquarters)లో విచారణకు హాజరుకావాలని తాజా నోటీసుల్లో స్పష్టం చేశారు.
ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ (Pride Infracon LLP) సంస్థతో జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో ఉన్న వ్యాపార సంబంధాలపై ఈడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన అక్రమ నిధుల ప్రవాహంలో జానకి లక్ష్మికి కూడా వాటా ఉందన్న అనుమానంతో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా మనీలాండరింగ్ నెట్వర్క్, నిధుల మళ్లింపులు, షెల్ కంపెనీల ద్వారా జరిగిన లావాదేవీలపై ఈడీ దర్యాప్తు కేంద్రీకృతమైందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ వ్యవహారంలో ఒకసారి ఈడీ ముందు హాజరైన జానకి లక్ష్మికి తాజాగా మరోసారి సమన్లు జారీ కావడం సంచలనంగా మారింది. ఈనెల 27న జరిగే విచారణలో ఆమె ఇచ్చే సమాధానాల ఆధారంగా మరికొంత మంది కీలక రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలకు కూడా నోటీసులు వెళ్లే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ కుటుంబానికి వరుసగా ఈడీ సమన్లు జారీ కావడంతో ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.






