ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్టీసీ భవిష్యత్తుపై (RTC Future) మరోసారి చర్చకు దారితీసేలా ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ (Konakalla Narayana) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వ ఆధారిత వ్యవస్థగా కొనసాగించడం కష్టమని, ముఖ్యంగా విద్యుత్ బస్సుల (Electric Buses) కొనుగోలు మరియు నిర్వహణ భారీ ఆర్థిక భారంగా మారిందని ఆయన పేర్కొన్నారు. పదివేల పాత బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకురావాలంటే సుమారు రూ.17 వేల కోట్ల వ్యయం అవసరమని, ఆ స్థాయి పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో ఆర్టీసీ లేదని స్పష్టం చేశారు.
స్త్రీ శక్తి పథకం (Sree Shakti Scheme) అమలుతో ఇప్పటికే సంస్థపై ఆర్థిక ఒత్తిడి పెరిగిందని, రోజురోజుకు కాలం చెల్లిన బస్సులు స్క్రాప్‌కు వెళ్తుండటంతో కొత్త ప్రత్యామ్నాయాలు అనివార్యమయ్యాయని కొనకళ్ల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నడపడం మేలని ఆయన చెప్పడం రాజకీయ, కార్మిక వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇప్పటికే 1050 ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదనలు సిద్ధం చేయగా, అందులో 750 బస్సులకు టెండర్లు పూర్తయ్యాయని, మరో రెండు మూడు నెలల్లో అవి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
అయితే ఇదే కొనకళ్ల నారాయణ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో భిన్నంగా మాట్లాడటం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ‘స్త్రీ శక్తి’ పథకం కారణంగా ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి వెళ్తోందన్న విమర్శలపై స్పందిస్తూ, అది ఆర్టీసీపై భారం కాదని, ప్రభుత్వం తిరిగి చెల్లించే సేవా చార్జీ మాత్రమేనని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఆర్టీసీ కేవలం సేవా ప్రదాత మాత్రమేనని చెప్పిన ఆయన, ఇప్పుడు అదే పథకం ఆర్థిక భారంగా మారిందని చెప్పడం ఉద్యోగ సంఘాలు మరియు ప్రతిపక్ష వర్గాల్లో అనుమానాలకు తావిస్తోంది.
ముఖ్యంగా గతంలో జగన్ ప్రభుత్వం విలీనం చేసిన ఆర్టీసీని ఇప్పుడు దశలవారీగా ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తున్నారా అనే ప్రశ్న ఉద్యోగుల్లో వినిపిస్తోంది. విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్ల ప్రవేశం పెరిగితే, భవిష్యత్తులో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుందా? ఉద్యోగ భద్రతపై ప్రభావం పడుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలనుకుంటుందా? లేక ఆర్థిక ఒత్తిడిని కారణంగా చూపుతూ ప్రైవేటు ఆధారిత నమూనాకు మారుస్తుందా? అనే అంశంపై ఇప్పుడు రాజకీయంగా కూడా తీవ్ర చర్చ మొదలైంది.






