ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసిన ఒక వివాహం తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ(BJP) నేత, మీరట్ జిల్లా పంచాయత్ చైర్మన్ గౌరవ్ చౌదరి (Gaurav Chaudhary) సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) ఎంపీ(MP) ధర్మేంద్ర యాదవ్ (Dharmendra Yadav) మాజీ భార్య మోనికా యాదవ్‌ను (Monika Yadav) వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుక గురువారం హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) అత్యంత గోప్యంగా, కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు సమాచారం.
ప్రస్తుతం ఫరూఖాబాద్ జిల్లా పంచాయత్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న మోనికా యాదవ్ 2021లో సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. రాజకీయంగా ప్రభావశీలమైన యాదవ్ కుటుంబానికి చెందిన ఆమెకు ఒకప్పుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. దీంతో ఈ వివాహం రాజకీయ వర్గాల్లో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
మోనికా యాదవ్ మరియు ధర్మేంద్ర యాదవ్ దంపతులు 2016లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ధర్మేంద్ర యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు బంధువు కావడం విశేషం. మరోవైపు గౌరవ్ చౌదరి కూడా తన తొలి భార్యతో విడిపోయిన అనంతరం మోనికా యాదవ్‌ను వివాహం చేసుకున్నారు. దీంతో ఇది ఇద్దరికీ రెండో వివాహంగా నిలిచింది.
సమాచారం ప్రకారం గౌరవ్ చౌదరి, మోనికా యాదవ్ గత 1 సంవత్సరం కాలంగా ఒకరికొకరు పరిచయం కలిగి ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అధికారిక కార్యక్రమంలో తొలిసారి కలిసిన వీరిద్దరూ అభివృద్ధి, స్థానిక పాలన అంశాలపై జరిగిన చర్చల సందర్భంగా మరింత దగ్గరయ్యారని తెలుస్తోంది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి, అనంతరం వివాహ బంధానికి దారితీసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
మోనికా యాదవ్ కుటుంబానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె తండ్రి నరేంద్ర సింగ్ యాదవ్ 6 సార్లు ఎమ్మెల్యేగా(MLA) ఎన్నికై ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ఆమె తాత రాజేంద్ర సింగ్ యాదవ్ (Rajendra Singh Yadav) కూడా ప్రముఖ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రజా సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు కావడం విశేషం.
ఇక గౌరవ్ చౌదరి రాజకీయ ప్రయాణం కూడా ప్రత్యేకంగా నిలిచింది. మీరట్ జిల్లాలోని కుసేడి గ్రామానికి చెందిన ఆయన 2006లో ఉన్నత విద్య కోసం జర్మనీకి వెళ్లారు. అక్కడ హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, హోల్‌సేల్ ట్రేడ్ రంగాల్లో వ్యాపారాలు నిర్వహించి విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. అనంతరం 2021లో భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన కొద్ది నెలల్లోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు.
స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన గౌరవ్ చౌదరి మీరట్ జిల్లా పంచాయత్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కీలక నేతగా ఎదిగారు. ఇప్పుడు మోనికా యాదవ్‌తో జరిగిన ఈ సీక్రెట్ వెడ్డింగ్ రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాహం భవిష్యత్‌లో ఉత్తరప్రదేశ్ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.








