ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రకటించిన “మూడో బిడ్డకు ₹30 వేలూ, నాలుగో బిడ్డకు ₹40 వేలూ” ప్రోత్సాహక పథకం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వం ముందుకు తెచ్చిన ఈ నిర్ణయం మహిళా వర్గాల (Women Groups) నుంచే భారీ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మహిళలను కేవలం పిల్లలను కనడానికే పరిమితం చేసే ఆలోచనలా ఇది కనిపిస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి (Kiran Bedi) ఈ అంశంపై స్పందిస్తూ, మహిళల జీవితం కేవలం పిల్లల పెంపకానికే కాదని గుర్తుచేశారు. వృత్తి, ఆశయాలు, సృజనాత్మకత, స్వతంత్ర జీవితం వంటి అంశాలపై మహిళలకే నిర్ణయ హక్కు ఉండాలని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. “మేల్కొనండి మహిళలారా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక నటి ఫూనం కౌర్ (Poonam Kaur) కూడా వ్యంగ్యంగా స్పందిస్తూ, భవిష్యత్ ఆర్థిక అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్(Nara Lokesh) ఎక్కువ మంది పిల్లలను కనాలని భావిద్దాం అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి.
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రేణుకచౌదరి (Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. “పిల్ల పుట్టిన తర్వాత వారి చదువు, వైద్యం, ఆహారం, ఉద్యోగ భద్రత వంటి అంశాలను ప్రభుత్వం భరిస్తుందా?” అంటూ ప్రశ్నించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని ప్రస్తావిస్తూ, ప్రజలకు అవసరమైంది ఉపాధి భద్రత గానీ ఆడంబర పథకాలు కావని మండిపడ్డారు.
ఇప్పటికే పిల్లల పెంపకం ఖర్చులు సాధారణ కుటుంబాలకు భారంగా మారిన పరిస్థితుల్లో, ప్రభుత్వాలు వాస్తవ సమస్యలను పరిష్కరించకుండా. మహిళల స్వేచ్ఛ, కుటుంబాల ఆర్థిక స్థితి, ప్రభుత్వ బాధ్యతలపై నిర్ణయాలు తీసుకోవడం కొత్త చర్చకు కేంద్రబిందువుగా మారింది.






