గతేడాది అక్టోబర్లో ‘సూపర్ జీఎస్టీ (Super GST).. సూపర్ సేవింగ్స్(Super Savings)’ కార్యక్రమం సందర్భంగా విజయవాడ (Vijayawada) బీసెంట్ రోడ్డులో (Besant Road) చిన్న వ్యాపారులతో కలిసి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), అక్కడే దివ్యాంగుడైన దుర్గారావును(Durga Rao) కూడా కలిశారు. అతని ఆర్థిక పరిస్థితిని (Financial Condition) తెలుసుకుని, పెన్షన్ (Pension), సొంత ఇల్లు మరియు జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ సమయంలో ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

అయితే, ఆ హామీలు అమలు దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దుర్గారావు ప్రకారం, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన తర్వాత ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నెరవేరుతుందని నమ్మకంతో ఎదురు చూసిన ఆయనకు నిరాశే మిగిలింది.
ఇటీవల ‘సీఎం(CM) వరమిచ్చినా న్యాయం జరగలేదు’ అనే ఫ్లెక్సీతో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేయడంతో ఈ విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ప్రజల ముందర ఇచ్చిన హామీలు అమలు కావడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది? ప్రచారం కోసం ఇచ్చిన హామీలేనా ఇవన్నీ? అనే ప్రశ్నలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఘటన ప్రభుత్వ వ్యవహారశైలిపై ప్రశ్నలు లేవనెత్తుతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో బాధ్యత ఎంతవరకు ఉందన్న అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చింది.






