పశ్చిమ కొలంబియాలో(Western Colombia) సోమవారం సంభవించిన భారీ భూకంపం (Massive Earthquake) తీవ్ర విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై (Richter Scale) 7.4 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి కనీసం 47 మంది మృతి చెందినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (Associated Press – AP) వెల్లడించింది. బలమైన ప్రకంపనల కారణంగా అనేక భవనాలు కుప్పకూలాయి. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. భూకంపం ఒక్కసారిగా సంభవించడంతో భయాందోళనకు గురైన వేలాది మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు.
భూకంప కేంద్రం ఎక్కడంటే..
కొలంబియా రాజధాని బొగోటాకు (Bogota) పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలోని చోకో ప్రాంతంలో ఉన్న శాన్ జోస్ డెల్ పాల్మర్ (San Jose del Palmar) వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 4,800 మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో భూకంపం భూమికి 107 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అమెరికా భూగర్భ సర్వే(U.S. Geological Survey – USGS) వెల్లడించింది. ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న ఈక్వెడార్‌లోనూ(Ecuador) కనిపించింది. పెరీరా నగరంలోనే అత్యధికంగా 18 మంది మృతి చెందినట్లు ఆ నగర మేయర్ మౌరిసియో సలాజర్(Mauricio Salazar) తెలిపారు. ప్రస్తుతం నగరంలో పరిస్థితి తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
కూలిన చారిత్రాత్మక చర్చి టవర్
భూకంపం ధాటికి పెరీరా, కాళీ, క్విబ్డో నగరాల్లో అనేక ఇళ్లు, చిన్న భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని నిర్మాణాలు పూర్తిగా కూలిపోయాయి. మానిజాలెస్ నగరంలోని చారిత్రాత్మక నియో-గోథిక్ కేథడ్రల్ టవర్ (Neo-Gothic Cathedral Tower) కూడా ప్రకంపనల ధాటికి తీవ్రంగా దెబ్బతిని కూలిపోయింది. దీంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
6 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిపివేత
భూకంప ప్రభావం పశ్చిమ కొలంబియాలోని విమానాశ్రయాలపైనా పడింది. పెరీరా, మానిజాలెస్, క్విబ్డో, అర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురా నగరాలకు సేవలందించే 6 విమానాశ్రయాలు (Six Airports) దెబ్బతిన్నాయి. భద్రతా కారణాలతో ఆయా విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పౌర విమానయాన సంస్థ వెల్లడించింది.
कोलंबिया में 7.4 तीव्रता का भूकंप… तेज झटकों से हिली धरती… 47 लोगों के मौत की खबर.. #Colombia #Earthquake pic.twitter.com/QJkLlybLLd
— Mahima Singh (@MahimaS45382990) August 10, 2026
సహాయక చర్యల్లో కొలంబియా ప్రభుత్వం
భారీ భూకంపంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో కొలంబియా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన దేశ అధ్యక్షుడు అబెలార్డో దే లా ఎస్ప్రియెల్లా(Abelardo de la Espriella) శాన్ జోస్ డెల్ పాల్మర్‌లో (San Jose del Palmar) కొనసాగుతున్న అత్యవసర సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం వారికి అండగా ఉందని, అవసరమైన సహాయాన్ని వెంటనే అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.
భారీ భూకంపాలు అరుదే..
కొలంబియాలో స్వల్పస్థాయి భూకంపాలు తరచుగా సంభవించినప్పటికీ, రిక్టర్ స్కేలుపై 6.0 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు. తాజాగా 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ నష్టాన్ని మిగల్చడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.








