ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా (Delhi Police Commissioner) సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ కుమార్ (Anurag Kumar) బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకు ఆయనను కొత్త పోలీస్ కమిషనర్‌గా నియమించారు. 1994 బ్యాచ్ ఐపీఎస్(IPS) అధికారి అయిన అనురాగ్ కుమార్, ఈ నియామకానికి ముందు ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్‌గా (Intelligence Bureau Special Director) పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన రోజునుంచే ఆయన నియామకం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా కొనసాగిన సతీష్ గోల్చాను (Satish Golcha) పదవీకాలం పూర్తికాకముందే ఆ బాధ్యతల నుంచి తప్పించారు. 1992 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్‌కు (AGMUT Cadre) చెందిన ఆయన 2027 వరకు ఈ పదవిలో ఉండాల్సి ఉన్నప్పటికీ, పరిపాలనా మార్పుల్లో భాగంగా ముందుగానే రిలీవ్ చేశారు. అనురాగ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గోల్చా తదుపరి పోస్టింగ్ కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు (Governor) రిపోర్ట్ చేయనున్నారు.
అనురాగ్ కుమార్ పోలీసింగ్‌తో పాటు ఇంటెలిజెన్స్ విభాగంలోనూ విశేష అనుభవం సంపాదించారు. ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన, ఢిల్లీ పోలీస్‌లో పలు జిల్లాలకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా సేవలందించారు. అనంతరం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరి అంతర్గత భద్రత, నిఘా వ్యవస్థలకు సంబంధించిన కీలక బాధ్యతలను నిర్వహించారు.
ఆయన సేవలకు గుర్తింపుగా 2010లో పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, 2016లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డులు అందుకున్నారు. వ్యూహాత్మక ప్రణాళికలు, భద్రతా వ్యవహారాల్లో నైపుణ్యం కలిగిన అధికారిగా అనురాగ్ కుమార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈ ఏడాది మార్చి 3న ఢిల్లీ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 70 మంది అధికారులను వివిధ విభాగాలకు బదిలీ చేశారు. ఇందులో 50 మంది ఐపీఎస్ అధికారులు, 20 మంది డానిప్స్ అధికారులు ఉన్నారు. ఆ పరిపాలనా మార్పుల కొనసాగింపుగానే ఇప్పుడు అనురాగ్ కుమార్‌ను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమించినట్లు అధికారులు భావిస్తున్నారు.







