తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) మరోసారి తీవ్ర కలకలం రేగింది. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత సీఎం విజయ్(CM Vijay), స్టార్ హీరోయిన్ త్రిషపై (Trisha Krishnan) డీఎంకే ఎమ్మెల్యే(DMK MLA) అనిత ఆర్. రాధాకృష్ణన్(Anitha R. Radhakrishnan) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. త్రిష పుట్టినరోజు (Trisha Birthday) సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం ఉదయం మాజీ మంత్రి, ప్రస్తుత డీఎంకే ఎమ్మెల్యే అనిత ఆర్. రాధాకృష్ణన్‌ను అరెస్ట్(Arrest) చేశారు.
తూత్తుకుడి జిల్లా (Thoothukudi District) ఆత్తూరు టౌన్ పంచాయతీ పరిధిలో ఇటీవల నిర్మించిన ప్రభుత్వ కార్యాలయ భవనంతో పాటు ఇతర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమం ముగించుకుని అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ను తప్పించుకునేందుకు అనిత రాధాకృష్ణన్ ముందస్తు బెయిల్ (Anticipatory Bail) కోసం మద్రాస్ హైకోర్టును (Madras High Court) ఆశ్రయించారు. అయితే శుక్రవారం ఉదయం ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనను సొంత కారులోంచి దించి పోలీసు వాహనంలోకి ఎక్కించి అధికారికంగా అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యే అరెస్ట్ వార్త క్షణాల్లోనే వ్యాపించడంతో అక్కడ ఉన్న డీఎంకే నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు వాహనాన్ని అడ్డుకుని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రహదారిపై నిరసన చేపట్టారు. దీంతో ఆత్తూరు ప్రాంతంలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు(Police) పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అదనపు బలగాలను రంగంలోకి దించారు.
నిరసనకారులను చెదరగొట్టిన అనంతరం పోలీసులు అనిత రాధాకృష్ణన్‌ను తదుపరి విచారణ కోసం జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో తూత్తుకుడి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
విజయ్(Vijay) రాజకీయ ప్రవేశం తర్వాత ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, మరోవైపు సినీ ప్రముఖులకు సంబంధించిన వివాదాలు రాజకీయ రంగు పులుముకోవడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై రాజకీయ వర్గాలతో పాటు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








