---Advertisement---

ED Raids: కేరళ రాజకీయాల్లో కలకలం..మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటిపై ఈడీ సోదాలు

May 27, 2026

Summarize with AI

---Advertisement---

కేరళ (Kerala) రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్ (Pinarayi Vijayan) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సీఎంఆర్ఎల్(CMRL)-ఎక్సాలోజిక్ (Exalogic) నెలసరి చెల్లింపుల కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ (Money Laundering) ఆరోపణల దర్యాప్తులో భాగంగానే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తిరువనంతపురంలోని పినరయి విజయన్ అద్దె నివాసంతో పాటు మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ (ED) బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి.

ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ఈడీ అధికారులు పినరయి విజయన్ నివాసానికి చేరుకుని సోదాలు (Raids) ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదే ఇంట్లో ఆయన కుమార్తె వీణా విజయన్(Veena Vijayan) కూడా నివసిస్తున్నట్లు సమాచారం. వీణా విజయన్‌కు చెందిన ఐటీ సంస్థ ‘ఎక్సాలోజిక్ సొల్యూషన్స్’(Exalogic Solutions) ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. సీఎంఆర్ఎల్ సంస్థ నుంచి ఎలాంటి సేవలు అందించకుండా భారీ మొత్తంలో నెలసరి చెల్లింపులు జరిగాయన్న అనుమానాలతో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

కేరళ హైకోర్టు ఇటీవల ఈడీ దర్యాప్తుకు అనుమతి ఇవ్వడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నమోదైన కేసులో ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్లపై అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. సీఎంఆర్ఎల్ కార్యాలయాలు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ కర్తకు (Sasidharan Kartha) సంబంధించిన ప్రాంగణాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఈ సోదాల సందర్భంగా డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీల పత్రాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ రికార్డులను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీణా విజయన్‌ను అధికారులు విచారించినట్లు సమాచారం. అయితే పినరయి విజయన్‌ను ఇప్పటివరకు అధికారికంగా ప్రశ్నించకపోయినా, దర్యాప్తు పురోగతిని బట్టి ఆయన స్టేట్‌మెంట్ కూడా నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇక బేపూర్ నియోజకవర్గ సీపీఎం ఎమ్మెల్యే, వీణా విజయన్ భర్త అయిన పీఏ మహమ్మద్ రియాస్(P. A. Mohammed Riyas) నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో ఈ కేసు రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను గుర్తించినట్లు సమాచారం. “మంత్లీ రిటైనర్స్”(Monthly Retainers) పేరుతో భారీ మొత్తాలు బదిలీ అయినట్లు దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది.

ఈడీ దాడులపై లెఫ్ట్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ కక్షసాధింపులో భాగమని లెఫ్ట్ ఫ్రంట్ ఆరోపిస్తోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి స్థాయి నేత నివాసంపైనే ఈడీ సోదాలు జరగడం కేరళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment