తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేనేత సంఘాల నాయకులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిమెట్ల వీర్రాజు, కోమాకుల వీరబాబు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలోని పద్మశాలి చేనేత కల్యాణ మండపంలో తలుపులు మూసుకుని దీక్షలో కూర్చోవడం ఉద్రిక్తతను పెంచింది.
చేనేత కార్మికుల సమస్యలపై గత కొన్ని నెలలుగా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి స్పందన రాలేదని నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 20 వరకు ‘చేనేతల ఆత్మగౌరవ దీక్ష’ పేరుతో రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇప్పుడు నిరవధిక నిరాహార దీక్షకు దిగినట్లు వెల్లడించారు.
చేనేత సహకార సంఘాలకు ఆప్కో మరియు ప్రభుత్వ బకాయిలు రూ.203 కోట్లు వెంటనే చెల్లించాలని, రద్దు చేసిన త్రిఫ్ట్ పథకం, పావలా వడ్డీ రుణాలు, యార్న్ సబ్సిడీ, 30 శాతం రిబేట్, 2018 రుణమాఫీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకాలను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. అదనంగా చేనేత రంగానికి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించాలని, నేతన్న భరోసా కింద ప్రకటించిన రూ.25 వేల సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఇక రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేనేత సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేసి, వైఎస్సార్ నేతన్న నేస్తం వంటి పథకాల ద్వారా ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారని, ఆప్కో బకాయిలు చెల్లించారని, పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తుచేస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాల మధ్య చేనేత కార్మికుల దీక్ష ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో, ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.








