పాకిస్తాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఖాసిం ఖాన్ (Qasim Khan) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి ఇప్పటికే 1100 రోజులుగా జైలులో(Jail) ఉన్నారని, ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని వెల్లడించారు. ముఖ్యంగా కంటి చూపు తగ్గిపోతోందని, వెంటనే సరైన వైద్య చికిత్స అందించాలని కోరుతూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.
ఎక్స్ వేదికగా స్పందించిన ఖాసిం ఖాన్.. ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు తమకు ఇప్పటివరకు పాకిస్తాన్ అధికారులు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. కుటుంబ సభ్యులను కూడా దూరంగా ఉంచడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని (Health Condition) దృష్టిలో ఉంచుకుని వెంటనే వైద్య సహాయం అందించాలని కోరారు.
పాకిస్తాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ (Democratic System) బలహీనపడుతోందని, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చర్యలు కొనసాగుతున్నాయని ఖాసిం ఖాన్ విమర్శించారు. ఈ పరిస్థితులపై ప్రపంచ దేశాలు స్పందించి, ఇమ్రాన్ ఖాన్ భద్రత, ఆరోగ్యంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఖాసిం ఖాన్(Qasim Khan), సులేమాన్ ఖాన్ (Sulaiman Khan) ప్రస్తుతం బ్రిటన్లో (Britain) నివసిస్తున్నారు. తోషాఖానా అవినీతి కేసులో 2023 ఆగస్టు 5న ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రావల్పిండిలోని అడియాల జైలులోనే ఆయన ఉన్నారు.
ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf – PTI) వెల్లడించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న తాజా సమాచారం పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీస్తోంది.








