బాలీవుడ్‌లో తనదైన మాస్ డ్యాన్స్ స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్(Choreographer) గణేశ్ ఆచార్య (Ganesh Acharya) జీవిత ప్రయాణం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆయన బయోపిక్‌గా(Biopic) రూపొందిన ‘గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్’(Ganesh: Dust to Stardust) ట్రైలర్ (Trailer) తాజాగా విడుదలైంది. సాధారణ డ్యాన్సర్‌గా మొదలైన ప్రయాణం.. బాలీవుడ్‌లో అగ్రశ్రేణి కొరియోగ్రాఫర్‌గా ఎదిగే వరకు ఆయన ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, భావోద్వేగాలను ఈ చిత్రం ప్రతిబింబించనుంది.
సాధారణంగా ప్రముఖుల జీవిత కథలను ఇతర దర్శకులు సినిమాలుగా తెరకెక్కిస్తుంటారు. అయితే గణేశ్ ఆచార్య తన జీవిత కథకు స్వయంగా రచన చేయడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు. ఆయన కుమార్తె సౌందర్య ఆచార్య(Soundarya Acharya) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన జీవితంలో ఎదురైన అనుభవాలను ఆయన ఎంత సహజంగా తెరపై చూపించారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
విడుదలైన ట్రైలర్‌లో గణేశ్ ఆచార్య జీవితంలోని కష్టాలు, కన్నీళ్లు, అవమానాలతో పాటు వాటిని అధిగమించి విజయాన్ని అందుకున్న తీరు ప్రధానంగా కనిపిస్తోంది. గణేశ్ ఆచార్య పాత్రలో యువ నటుడు శివాంశు సోని నటించగా, అలోక్ షా, సుకన్య కలన్, సాక్షి పవస్కర్ కీలక పాత్రలు పోషించారు.
జునైద్ కుమార్ (Junaid Kumar) అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని భావోద్వేగ సన్నివేశాలకు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. బాలీవుడ్‌లో ఎన్నో హిట్ పాటలకు కొరియోగ్రఫీ అందించిన గణేశ్ ఆచార్య వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లు, ఆయన విజయ ప్రస్థానం ఈ బయోపిక్‌లో కీలకంగా ఉండనున్నాయి.
‘గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్’ చిత్రం డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. తన జీవితాన్నే కథగా మలుచుకుని దర్శకత్వం వహించిన గణేశ్ ఆచార్య ఈ సినిమాతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.








