భారత ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్సీటీసీలో(IRCTC) కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ (Sanjay Kumar Jain) తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. పదవీకాలం పూర్తికాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రైల్వే వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా (Resignation) చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పూర్తి స్థాయి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ కుమార్ జైన్, కొద్ది నెలల వ్యవధిలోనే తప్పుకోవడం (Stepping Down) అనూహ్య పరిణామంగా భావిస్తున్నారు. ఆయన రాజీనామా జూలై 20 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
1990 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (Indian Railway Traffic Service – IRTS) అధికారిగా సంజయ్ కుమార్ జైన్‌కు రైల్వే శాఖలో విశేష అనుభవం ఉంది. ఐఆర్సీటీసీ బాధ్యతలు చేపట్టకముందు ఉత్తర రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా సేవలందించడంతో పాటు పలు కీలక హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.
సంజయ్ కుమార్ జైన్ రాజీనామాతో ఐఆర్సీటీసీ పరిపాలనలో తాత్కాలిక ఏర్పాట్లపై రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) దృష్టి సారించింది. సంస్థ రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా త్వరలోనే ఒక తాత్కాలిక చీఫ్‌ను నియమించేందుకు రైల్వే బోర్డు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
తాత్కాలిక నియామకం అనంతరం పూర్తి స్థాయి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఐఆర్సీటీసీలో జరిగిన ఈ మార్పు రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.








